వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: యూరియా పంపిణీ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రైతుల అవసరాల మేరకే పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి అధికారులకు సూచించారు. యూరియా, ఇతర ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, ఎవరైనా డీలర్లు, వ్యాపారస్తులు ఎక్కువ మొత్తంలో నిల్వలు చేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్మే ప్రయత్నం చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్ధారించిన ధరకంటే ఎక్కవ ధరకు అమ్మకాలు జరిపినా కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్రం రాష్ట్రానికి పంపించే కొద్దీ ఎరువులను అందుబాటులో వుంచుతున్నామని తెలిపారు. కొన్ని జిల్లాల్లో రైతులు ఎరువుల కోసం గంటలతరబడి వరుసలో నిలబడుతున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు వరుస క్రమంలో యూరియా పంపిణీ జరుగుతుందని తెలిపారు. యూరియా ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 89777-41771 నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. కేంద్ర వ్యవసాయశాఖ, ఎరువుల శాక కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, అగ్రికల్చర్ ఫార్మర్ సంక్షేమ శాఖ సెక్రటరీ దేవేష్ చతుర్వేదిలు అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిపారు. రాష్ట్రాలలో కేంద్ర తనిఖీ బృందాలు కూడా తనిఖీలు చేపట్టే అవకాశం ఉందన్నారు.



