అసంపూర్తి ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాలి

భ‌విష్య‌త్  ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలి
అధికార్ల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు
 అభివృద్ధి ప‌నుల‌ను ముఖ్య‌మంత్రికి వివ‌రించిన అధికారులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 25:  అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధ‌వారం  మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవెలప్ మెంట్  అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  నగరంలో పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డుపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. కాగా హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలను అధికార్లు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల ప్రస్తుత పరిస్థితిని రేవంత్‌రెడ్డికి వివ‌రించారు.   ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు ముఖ్య‌మంత్రి సూచించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలతో రావాల‌న్నారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిచారు.  కోర్ అర్బన్ రీజియన్ కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించే దిశగా చర్యలు తీసుకోవాల‌న్నారు. ఇంకా ఈ స‌మీక్షా స‌మావేశంలో   సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ పరిధిలోని  ఎంఏ అండ్ యూడీ సెక్రటరీ ఇలంబర్తి, జిల్లా హెచ్ ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌.వి. కర్ణన్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె. శశాంక, హెచ్ఎం ఎస్ ఎస్ డ‌బ్ల్యుడి ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్  ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *