– ఎస్‌హెచ్‌జీలకు అందించే చీరల ఉత్పత్తి వేగవంతం చేయాలి
– సచివాలయంలో చేనేత, జౌళిశాఖపై మంత్రి తుమ్మల సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: మార్కెట్ డిమాండుకనుగుణంగా, మార్కెట్లో పోటీపడే విధంగా క్వాలిటీ వస్త్రాలను చేనేత సంఘాలు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో చేనేత, జౌళిశాఖ పథకాల అమలు తీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వేడుక ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చేనేత రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని, సంప్రదాయ చేనేతలైన గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, ఆర్మూర్ పితాంబరి, మహదేవ్‌పూర్ టస్సర్ పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, వరంగల్ దర్రీస్, కరీంనగర్ బెడ్‌షీట్లు, ఆలంపూర్ టవల్స్, దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరుగాంచాయన్నారు. వీటిని కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే వస్త్ర ప్రదర్శనలో ఆయా చేనేత సంఘాల ద్వారా ప్రదర్శించాలని మంత్రి సూచించారు. చేనేత రుణ మాఫీ గురించి మాట్లాడుతూ ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి వారి ఖాతాలలో నిధులు జమ చేయాలన్నారు. ఇందిరా క్రాంతి మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే చీరలను పరిశీలించి వాటి ఉత్పత్తిని వేగవంతం చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ఇండెంట్ల ప్రకారం వస్త్రాల, మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు నిరంతరం పని కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం తెలంగాణ చేనేత అభయ హస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు, భరోసా, భద్రతా పథకాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, చేనేత, జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు.





