పార్లమెంట్‌ సాక్షిగా తప్పుడు లెక్కలు

– రాష్ట్రానికి కేటాయించిన యూరియా 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే
– కేటాయింపుల ప్రకారం సరఫరా చేయకపోవడంతో 2.24 లక్షల మెట్రిక్‌ టన్నుల లోటు
– కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు మంత్రి తుమ్మల లేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: పార్లమెంట్‌ సాక్షిగా యూరియా సరఫరాపై తప్పుడు లెక్కలు చెప్పడం శోచనీయమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు అన్నారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయించి పార్లమెంట్‌లో మాత్రం 20.20 లక్షల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉందని చెప్పడం వల్ల రాష్ట్ర రైతులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యూరియా పరిస్థితులపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌కు కేంద్ర రసాయనాలు, ఎరువుల విభాగం రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల లేఖను జతపరిచి మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఖరీఫ్‌ 2025 కోసం రాష్ట్రానికి కేవలం 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయించిందని, అందులో కూడా నెలవారీ సరఫరా చేయాల్సిన దానికంటే తక్కువగా సరఫరా చేయడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిరదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుండి జులై వరకు కేటాయింపుల ప్రకారం 6.60 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా కేంద్రం 4.36 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని, దీంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేవలం తెలంగాణలోనే కాక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా ఈ పరిస్థితులున్నాయని గుర్తు చేశారు. యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖలు రాశారని అందులో తెలిపారు. జులై వరకు కేటాయింపుల ప్రకారం సరఫరా కాని 2.24 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కలుపుకుని ఆగస్టు నెలకు కేటాయించిన యూరియా త్వరగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తమ్ముల ఆ లేఖలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *