తుఫాన్‌తో నష్టంపై వివరాలు త్వరగా పంపండి

– జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1 : ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొంథా తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో శనివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 24 జిల్లాలు ఈ మొంథా తుఫాన్‌కు ప్రభావితమయ్యాయని తెలిపారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టంతోపాటు రహదారులు, నీటి వనరులు, పశువులు, ప్రాణ నష్టంతోపాటు ఇతర ప్రాథమిక వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏవిధమైన సూచనలు లేకుండా 25 నుండి 30 సెం.మీ వర్షపాతం ఆకస్మికంగా కురుస్తోందని, ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లాల వారీగా ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సీఎస్‌ సూచించారు. తుఫాన్‌ ప్రభావంతో ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రహదారులు, విద్యుత్‌ లైన్లు, నీటి వనరులకు తాత్కాలిక పునరుద్ధరణ పనులు ముమ్మరంగా చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎక్కడైనా అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల భవనాలు ధ్వంసం అయితే వాటి పునరుద్ధరణకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. నష్టపరిహారం అందించేందుకు వీలుగా నష్టం వివరాలను సోమవారం నాటికి పంపించాలని, ఎలాంటి అలసత్యం లేకుండా పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *