TS UTF | విద్యార్థుల భవిష్యత్తును తీర్చ‌దిద్దేది ఉపాధ్యాయులే..

  • ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
  • మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క
  • ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎమ్మెల్యే పల్లా
  • జనగామలో ఘనంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశం

జనగామ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : విద్యార్థుల భ‌విష్య‌త్తును ఉన్న‌తంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేన‌ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్  (TS UTF) రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను కూడా ఎస్టీ వసతి గృహంలో ఉండి చదువుకున్నాన‌ని, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఎర్రజెండా నీడలో ఉండి నేర్చుకున్నాన‌ని తెలిపారు. ప్రభుత్వ విద్యావ్యవస్థలో బలమైన ఉపాధ్యాయులు ఉంటారు. ఎలాంటి విద్యా విధానం ఉండాలనే దాని పై యూటీఎఫ్ ముందు వరుసలో ఉంటుంది. విద్యార్థులకు అత్యంత విలువలతో కూడిన విద్యను అందిస్తే వారు రేపటి భారత భావి పౌరులుగా తయారవుతారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ విద్య ఎంతో గొప్ప‌ది. ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి ని ఆదర్శవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే ఘ‌న‌త ఒక టీచర్ కే దక్కుతుంది. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు మరింత నమ్మకం కల్పిస్తే వారిపై ఆర్థిక భారం తగ్గుతుంది. అందరి సహకారంతో విద్యావ్యవ స్థను బలోపేతం చేద్దాం. ప్రభుత్వం ఎప్పుడూ ఉపాధ్యా యుల వెంట ఉంటూ విద్యావ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తోంది. ఎన్నో స్కూళ్లు స్కూల్లు మూతపడే ప‌రిస్థితి ఎదురవుతోంది. యూపీఏ ప్రభుత్వంలో వామపక్ష భాగస్వామ్యంతో ఉపాధి హామీ చట్టం తీసుకొవచ్చారు. ఉపాధి హామీలో అప్పుడు 90% కేంద్రం నిధులు,10% రాష్ట్రం నిధులు ఉండేవి. ఆ చట్టానికి అనేక రకాలుగా కొర్రీలుపెడుతూ 40 శాతం రాష్ట్రాలు, 60 % కేంద్రం నిధులు ఇచ్చేవిధంగా మార్పు చేశారు. ఈరోజు అది ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. ఆ చట్టాన్ని కాపాడుకోవడం ద్వారా పెద కూలీలకు ఉపాధి దొరుకుతుందన్నారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న వంతు కృషి చేశాన‌న్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు త‌న‌ ప్రయత్నంలో లోపం లేదు. ప్రతీది ప‌రిష్కారం కాక‌పోవ‌చ్చు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు త‌గ్గిపోతుండ‌డం ఆందోళనకరం. ప్రభుత్వ పాఠశాలలో పూర్వవైభవం తీసుకువ‌చ్చే బాధ్య‌త ఉపాధ్యాయులపై కూడా ఉంటుంది. మనమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ల‌మే. రాష్ట్రంలో 58 లక్షల మంది విద్యార్థులు ఉంటే, 60 శాతానికి ప్రైవేట్ విద్య వ్యవస్థ పెరిగింది. కచ్చితంగా దీనిపై పునరాలోచించుకోవాలి ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించ డంలో అందరి కంటే ముందు వరుసలో ఉపాధ్యాయులు ఉండాలి. ఉద్యమాలు, విప్లవాలు ప్రతి విషయంలో నాయకత్వం వహించి వారిని చైతన్యపరిచింది ఉపాధ్యాయులే. అలాంటి ఉత్తమ సంఘంగా గుర్తింపు పొందిన యూటీఎఫ్ ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ముందు వరసలో ఉండి పోరాడాలి అని పిలుపునిచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *