– పార్లమెంటులో ప్రసంగం.. స్వాగతించిన ఎంపిలు
– ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ అభినందనలు
– ఎల్లవేళలా అమెరికా అండ ఉంటుందని హామీ
టెల్‌అవీవ్, అక్టోబర్ 13: హమాస్‌తో యుద్ధ విరమణను స్వాగతిస్తూ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. థాంక్యూ వెరీమచ్ బీబీ.. గొప్ప పని చేశావని పొగిడారు. రెండేళ్లుగా తమ చెరలో ఉన్న బందీలను హమాస్ విడిచిపెట్టిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ చట్ట సభలో మాట్లాడుతూ మధ్యప్రాచ్యంలో సరికొత్త చరిత్ర ఉదయిస్తోంది. ఈ పవిత్ర భూమిలో శాంతి వీచికలు వీస్తుండగా ఆకాశం నిర్మలంగా మారింది. తుపాకులు మూగబోయాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న స్వర్ణయుగం ఇజ్రాయెల్‌లో ప్రారంభమైంది. బందీలు తిరిగివచ్చారు. ఈ మాట చెప్పడం ఎంతో బాగుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మేం సమయాన్ని వృథా చేస్తున్నామని చాలామంది అన్నారు. కానీ మేం సాధించాం అని ట్రంప్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో యూదులపై నాజీలు సాగించిన నరమేధం హోలోకాస్ట్ తర్వాత యూదులపై జరిగిన అత్యంత దారుణంగా అక్టోబర్ 7 దాడులను అభివర్ణించారు. అమెరికా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని బాధిత కుటుంబాలను ఉద్దేశించి పేర్కొన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు, సలహాదారుడు జేర్డ్ కుష్నర్‌ను ఈ సందర్భంగా కొనియాడారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో వీరు కీలకపాత్ర పోషించారు. అయితే ట్రంప్ మాట్లాడుతోన్న సమయంలో కొందరు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. మారణహోమం అంటూ నినాదాలు చేశారు. దాంతో వారిని చట్టసభ నుంచి బయటకు పంపివేశారు. ఈ నిరసనలపై ట్రంప్‌నకు స్పీకర్ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారమంతా గమనించిన ట్రంప్ సమర్థవంతంగా పనిచేశారని చమత్కరించారు. దాంతో సభ్యులంతా చిరునవ్వులు చిందించారు. నెతన్యాహుతో కలిసి జెరూసలెంలోని చట్టసభకు వెళ్లారు. అక్కడ ఇజ్రాయెల్ చట్ట సభ్యులు ఘన స్వాగతం పలికారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసినందుకు రెండున్నర నిమిషాలపాటు లేచి నిలబడి కరతాళధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎప్పుడూ తోడుగా ఉంటుందని హామీనిచ్చారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో పాలస్తీనా-ఇజ్రాయెల్ జాయింట్ పొలిటికల్ పార్టీకి చెందిన ఎంపీ ప్లకార్డు ప్రదర్శించారు. ’పాలస్తీనాను గుర్తించాలి’ అంటూ నినాదాలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





