ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, జూన్11 : గిరిజన జాతి మరింత జాగృతం కావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 1961లో నాటి జనాభా గణన సందర్భంగా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా ప్రచురించిన పుస్తకాన్ని తెలుగులో ప్రొఫెసర్ జాటోత్ రాజారాం, ఆంగ్లంలో ముదావత్ రామునాయక్ అనువదించారు. ’1961లో బంజారా గిరిజనుల జీవనం’ పుస్తకాన్ని ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్ కోదండరాం బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు 1961లో బంజారా గిరిజనుల జీవనం పుస్తకం ఎంతో దోహదపడుతుందన్నారు. బంజారాల జీవితాన్ని ప్రతిబింబించే ఆనాటి గిరిజనుల జీవన స్థితిగతులపై రూపొందించిన ఆంగ్ల మోనోగ్రాఫ్ను నేటితరాలకు ఉపయోగపడేలా తెలుగులో అనువదించడం అభినందనీయమన్నారు. గిరిజన జాతి జాగృతం కోసం ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తక ప్రతులను ప్రభుత్వ అధికారులకు అందజేయాలని, అప్పుడు బంజారా గిరిజనుల జీవనం, వారి సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలుస్తాయని చెప్పారు. కార్యక్రమానికి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధి డి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణ అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన అధ్యక్షుడు అంగోత్ రాంబాబునాయక్, ప్రేమ్‌చంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





