అమెరికాలో ఇంధనం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో రూ. 84,492 కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. ఇప్పుడు అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం అటు రాజకీయ రంగంతోపాటు ఇటు వ్యాపార రంగంలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్.. వివిధ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్లు) లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదవ్వడమే గాకుండా యూఎస్ కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిం చగలవని తాము విశ్వసిస్తున్నట్లు అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్-అమెరికా సంబంధాలు దృఢంగా ఉన్నాయని, ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు కలిసి అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే…ప్రపంచ దేశాలు పునరుత్పాదక శక్తి రంగంవైపు అడుగులు వేస్తున్న క్రమంలో సౌర విద్యుత్తు రంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లను దక్కించుకొనేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు రూ. 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్‌బీఐ తన ఆరోపణల్లో వెల్లడిరచింది. తద్వారా వొచ్చే 20 ఏండ్లలో కనిష్ఠంగా 2 బిలియన్ డాలర్లు లబ్ది పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆరోపించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. అమెరికా ఫెడరల్ కోర్టులో అదానీకి సంబంధించి ముఖ్యంగా రెండు అభియోగాలు నమోదైనట్టు అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ వెల్లడిరచింది. అందులో ఒకటి.. తప్పుడు సమాచారం చూపించి 2 బిలియన్ డాలర్ల మేర రుణాలకు అర్జీ పెట్టడం కాగా రెండోది.. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని మదుపర్లకు 1 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను ఆఫర్ చేయడం.
ఈ రెండు అభియోగాలపై న్యూయార్క్‌లోని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ కోర్టు అదానీ సహా ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన కారణంగా గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అజురా పవర్ అనే కంపెనీకి కూడా ఇదే కేసులో తాము నోటీసులు పంపించినట్టు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) ఒక ప్రకటనలో వెల్లడిరచింది. కాగా, ఈ కేసులో నిందితులు ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ దర్యాప్తును అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్టు కోర్టు ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. అదానీపై అమెరికాలో కేసు నమోదుకావటం ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థపై, అదానీ గ్రూపుపై ప్రభావం చూపుతున్నాయి.
తాజా ఆరోపణలకు కేంద్రంగా ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ కూడా 60 కోట్ల డాలర్ల (సుమారు రూ. 5 వేల కోట్లు) బాండ్ల జారీ విషయంలో ముందుకు వెళ్లలేమని ప్రకటించింది. అదానీతో భారత దేశ ఆర్థిక వ్యవస్థ లోతుగా ముడిపడి ఉంది. ఆయన దేశంలో 13 ఓడరేవులు (30 శాతం మార్కెట్ వాటా), ఏడు విమానాశ్రయాల (ప్రయాణికుల రద్దీలో 23 శాతం)తో పాటు సిమెంట్ వ్యాపారం (20 శాతం మార్కెట్ వాటా) నిర్వహిస్తున్నారు. దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ వ్యాపారం అదానీదే. ఆరు బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ లు కూడా ఆయన సొంతం. దేశంలోని విద్యుత్ రంగంలో ఆయనే అతిపెద్ద ప్రైవేట్ ప్లేయర్. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 50 బిలియన్ల డాలర్ల (సుమారు రూ. 4 లక్షల కోట్లు) పెట్టుబడి పెడతానని చెప్పడంతో పాటు 8,000 కివిరీ పొడవైన సహజ వాయువు పైప్‌ల్కెన్‌ను నిర్వహిస్తున్నారు. దేశంలోని అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మిస్తున్నారు. అలాగే అతిపెద్ద మురికివాడను అందంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.
ఆయన వద్ద 45,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు దేశాల్లో ఆయన వ్యాపారాలు ఉన్నాయి. ఇండోనేసియా, ఆస్ట్రేలియాల్లో బొగ్గు గనులతో పాటు కెన్యా, మొరాకోలో ఇంధన ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. టాంజేనియా, కెన్యాలోనూ మౌలిక వసతుల ప్రాజెక్టులపై దృష్టి సారించారు. గౌతమ్ అదానీ కంపెనీ దశాబ్దాలుగా స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్‌లో మోసాలకు పాల్పడిరదంటూ అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో ఒక నివేదికను విడుదల చేసింది. దురుద్దేశపూర్వకంగా, తప్పుడు సమాచారంతో ఈ నివేదికను రూపొందించారని అదానీ గ్రూపు తోసిపుచ్చింది. ఆ తర్వాత దాదాపు రెండేళ్లుగా తన ఇమేజ్‌ను పునర్నిర్మించుకునేందుకు అదానీ ప్రయత్నిస్తున్న తరుణంలో తాజాగా లంచానికి సంబంధించిన ఆరోపణలు మరోసారి ఆయనను చుట్టుముట్టాయి.తాజా ఆరోపణలు మార్కెట్ సెల్ ఆఫ్‌ను, దర్యాప్తును ప్రేరేపించాయి. భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం స్వదేశంలో ప్రాజెక్టుల కోసం మూలధనాన్ని సేకరించడం అదానీకి ఇది సవాలుగా మారొచ్చు.
మార్కెట్ స్పందించిన తీరును చూస్తే ఇది ఎంత తీవ్రమైన అంశమో తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్న అదానీ ప్రణాళికలకు తాజా అభియోగాలు ఆటంకంగా మారొచ్చు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని టేకోవర్ చేయడంతో పాటు వివాదాస్పద ఇంధన ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే ఆయన కెన్యా, బంగ్లాదేశ్‌లో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇప్పటికే, గౌతమ్ అదానీ గ్రూప్‌తో ఉన్న రెండు కీలక ఒప్పందాలను కెన్యా అధ్యక్షుడు విలియం రూటో రద్దు చేశారు. తమ విచారణ సంస్థలు, భాగస్వామ్య దేశాలు అందించిన కొత్త సమాచారం ఆధారంగా ఒప్పందాలను రద్దు చేసినట్లు రూటో చెప్పారు. ఇక రాజకీయంగా చూస్తే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే దీనిపై మాట్లాడారు. అదానీని అరెస్ట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. భారత్‌లోని ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వడం ఇక్కడ వార్త కాదు. కానీ, అందులో పేర్కొన్న మొత్తాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ లంచాన్ని అందుకున్న కొంతమంది పేర్లు కూడా అమెరికా వద్ద ఉండొచ్చని అనుమానంగా ఉంది. ఇది భారత రాజకీయాల్లో కలకలం రేపొచ్చు. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి వుంది.
-వడ్డె మారన్న
(సీనియర్ జర్నలిస్ట్)
9000345368





