– మంత్రులు తుమ్మల, జూపల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధిపరిచి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, హార్టీకల్చర్, హ్యాండ్లూమ్ టెక్స్‌ట్కెల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి, జనరల్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డిలతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఏకో, టెంపుల్ టూరిజంలను అభివృద్ధిపరిచే ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్, నేలకొండపల్లి వద్ద ఉన్న బౌద్ధస్థూపం, పర్ణశాల, భద్రాచలం టెంపుల్, కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరిత హోటల్, కనిగిరి హిల్స్, వైరా రిజర్వాయర్, వెలుగుమట్ల అర్బన్ పార్కు, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే, ఖమ్మంలో కొత్తగా ఒక హరిత హోటల్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్‌కు అనువైన వాతావరణం, ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం రామాలయాన్ని మరింత అభివృద్ధిపరిచి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఇందుకు టూరిజం డిపార్టుమెంట్, కార్పొరేషన్‌లు కృషి చేయాలని మంత్రులు తెలిపారు. అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ద్వారా గాని, ప్రైవేట్ భాగస్వామ్యంలో గాని వెంటనే మంజూరు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. జిల్లాలో టూరిజం డిపార్టుమెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి తగు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని, టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉన్నందున, తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం పట్టణ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రదేశంలో ఎకో టూరిజంకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఖమ్మం పట్టణంలో హరిత హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, కొత్తగూడెంలో ఉన్న హరిత హోటల్‌ను అందుబాటులోకి తేవాలని తుమ్మల. జూపల్లి అధికారులను ఆదేశించారు.


