– ఏడాదికి 2 లక్షల ఎకరాల్లో సాగు ప్రభుత్వ లక్ష్యం
– సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాదన, ప్రజాతంత్ర, నవంబరన 11: ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, ఇందులో 73,696 మంది రైతులు భాగస్వామ్యమయ్యారని తెలిపారు. 2021-22 నుండి ఇప్పటివరకు 2.28 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినట్టు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 లక్షల ఎకరాల లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు 31,158 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగినట్టు చెప్పారు. మార్చి నాటికి మిగిలిన 93,842 ఎకరాలు సాగులోకి రావాల్సి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగుకు 12 లక్షల ఎకరాలకు పైగా అనువైన భూమి ఉంది.. వచ్చే నాలుగేళ్లపాటు ఏటా రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలి.. మూడేళ్లల్లో పది లక్షల ఎకరాల విస్తీర్ణం సాగుతో దేశంలోనే ఆయిల్ పామ్ ఉత్పత్తిలో మొదటి రాష్ట్రంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. గత అయిదేళ్లల్లో రాష్ట్రానికి 6.54 లక్షల ఎకరాల లక్ష్యం కేటాయించగా 2.28 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చిందని తెలిపారు. సాగు విస్తరణలో నిర్లక్ష్యం వహించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తక్కువ పురోగతి ఉన్న జిల్లాలుగా వరంగల్, నారాయణపేట, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, గద్వాల్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్‌లను గుర్తించినట్టు తెలిపారు. ఈ జిల్లాల్లో ఆయా కంపెనీలు లక్ష్యాలకనుగుణంగా వేగంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి కంపెనీ తమ పరిధిలోని జిల్లాల్లో సరిపడ సిబ్బందిని నియమించుకుని రైతులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలని, తోటల యాజమాన్యంలో నీటి వినియోగం, ఎరువుల పంపిణీ, అంతర పంటలు, కలుపు నివారణ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. కొత్త తోటలలో గెలల దిగుబడులు తగ్గకుండా పర్యవేక్షించడం, విజయవంతమైన రైతుల అనుభవాలను కొత్త రైతుల ప్రోత్సాహానికి వినియోగించడం అవసరమని అన్నారు. తక్కువ ఎత్తు, ఆకు తక్కువ పొడవు, అధిక దిగుబడి ఇచ్చే కొత్త రకం మొలకలను దిగుమతి చేసుకోవాలని, రాబోయే ఏడాదికి మొక్కల డిమాండ్ పెరగనున్నందున ప్రతి కంపెనీ తన లక్ష్యానికనుగుణంగా నర్సరీలను ఏర్పాటు చేసుకొని నాణ్యమైన మొక్కలు రైతులకు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతుల సందేహాల నివృత్తికి తమ పరిధిలో రైతు సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతు వేదికల కార్యక్రమాల్లో కంపెనీ ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొని రైతులతో చర్చించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో విజయవంతమైన రైతులను రైతు వేదిక కార్యక్రమంలో మాట్లాడిరచేందుకు ప్రయత్నించాలన్నారు. వచ్చే ఏడాదికల్లా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆయిల్ పామ్ విస్తరణలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, సహకార శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తక్కువ పురోగతి ఉన్న జిల్లాలను ఉద్యానశాఖ సీనియర్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, ప్రతి జిల్లాలో లక్ష్యానికనుగుణంగా విస్తరణ కార్యక్రమాలు జరిగేలా మార్గదర్శనం చేయాలన్నారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల పురోగతిపై సమీక్షిస్తూ త్వరలో ప్రారంభం కానున్న ఫ్యాక్టరీల వివరాలు వెల్లడించారు. నర్మెట్ట (సిద్దిపేట)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ 30-120 టన్నుల సామర్థ్యంతో ఈనెలలో, పెద్దపల్లి జిల్లాలో తిరుమల ఆయిల్ ఫ్యాక్టరీ 15 టన్నుల సామర్థ్యంతో జనవరి 2026లో, ఖమ్మంలో గోద్రెజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ 15-60 టన్నుల సామర్థ్యంతో జనవరి 2026లో, వనపర్తిలో ప్రీ యూనిక్ ఫ్యాక్టరీ 15-30 టన్నుల సామర్థ్యంతో ఫిబ్రవరి 2026లో, కల్లూరు గూడెం (ఖమ్మం)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ 15-60 టన్నుల సామర్థ్యంతో జూన్ 2026లో, బీచుపల్లి (గద్వాల్)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ 15 టన్నుల సామర్థ్యంతో జూన్ 2026లో, ములుగు జిల్లాలో కె.ఎన్.బయో సైన్సెస్ ఫ్యాక్టరీ 10 టన్నుల సామర్థ్యంతో ఆగస్టు 2026లో ప్రారంభం కానున్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని ఆయిల్ పామ్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడం ద్వారా రైతుల ఆదాయ వనరులు పెంచడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సమావేశంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



