బనకచర్లపై రేపు అఖిలపక్ష సమావేశం

ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లకు అహ్వానం
గోదావరి-బనకచర్లపై తదుపరి చర్యలకు కార్యాచరణ ప్రణాళికకు సన్నాహాలు
-మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును మరింత గట్టిగా ప్రతిఘటించడంతోపాటు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లను తాను స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించానన్నారు. అందుబాటులో ఉన్న లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి సమావేశంలో పాల్గొనాలని కూడా కోరామన్నారు. ఈమేరకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి, తాను జూన్‌ 3న కొత్త దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్‌.పాటిల్‌ను స్వయంగా కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అభ్యంతరాలను లేవనెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకు కేంద్రమంత్రి పాటిల్‌ స్పందిస్తూ 2025 మే 28న తనకు రాసిన లేఖలో గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుకు సంబంధించిన డి.పి.ఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు అందలేదని చెబుతూనే అది అందిన మీదట నీటి కేటాయింపులలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు, ట్రిబ్యునల్‌ తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలతోపాటు 2014 ఆంద్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాలను పరిగణనలోకి తీసుకున్నాకే సమీక్షిస్తామని చెప్పారన్నారు. తిరిగి జూన్‌ 13న తాను కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో గోదావరి-బనకచర్ల లింక్‌ పథకంపై అభ్యంతరాలను తెలియపరచానన్నారు. అంతేగాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను కేంద్ర జల సంఘం నిలువరించాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని మంత్రి ఉత్తమ్‌ ప్రస్తావించారు. వీటన్నింటినీ సమీక్షించిన మీదట గోదావరి-బనకచర్ల విషయంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *