నేటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం….!

  కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు భాజపా త్రిముఖ పోటీలో ఎవ్వరికీ వారు తమ విధానాలతో, భవిష్యత్తు అంచనాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.వీటితోపాటు కేసీఆర్ మౌనం,బిసీల వాటా పెంపు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, రాజకీయ నాయకుల అరెస్టు లు వంటి తదితర అంశాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగానే కనిపిస్తున్నాయి.ప్రజా సమస్యలపై అన్ని పార్టీల స్పందనలు ఎలా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఈ ప్రముఖ నాయకుల ప్రసంగాల్లోని కొన్ని కామెంట్లు, చేష్టలు సామాన్య ప్రజలు సైతం అసహ్యించుకునే స్థాయిలో ఉంటున్నాయి.ప్రజాప్రతినిధులమని మరచి వ్యక్తిగత దూషణలతో, ద్వేషపూరిత చర్యలతో వాళ్ళు అనుసరిస్తున్న వైఖరులు, విధానాలు, సోషల్ మీడియా వార్ లు ఆందోళనకరంగా ఉంటున్నాయి..  
తెలంగాణ ప్రజల అభివృద్ధే మా అజెండా అంటూ కాంగ్రెస్,బిఆర్ఎస్ మరియు భాజపా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు తమదైన పంథాలో తెలంగాణ  రాజకీయాల్లో పదునైన మాటలు మరియు వ్యూహాలతో పాటు ఒకరి మీద ఒకరు తీవ్ర నిందారోపణలు చేస్తూ ముందుకెళ్తున్నారు.మాది ప్రజాపాలన అంటూ అధికారపక్షం,మేము  ప్రజాపక్షం  అంటూ ప్రతిపక్షం పోతున్న పోకడలు ఆ పార్టీల కార్యకర్తలు,నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు.నేటి తెలంగాణ ముఖచిత్రంపై నలుగురు నాయకులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.ఆ నలుగురే రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి,కెటిఆర్ మరియు హారీష్ రావు.
ఈ దశాబ్ద కాలంలో రేవంత్ రెడ్డి ప్రస్తుత,తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి గా ఎదిగిన తీరు,ఆయన జీవితంలో జరిగిన పరిణామాలు ప్రతీదీ ఆసక్తిదాయకం.కొన్ని సందర్భాలు స్ఫూర్తిదాయకం.  ప్రస్తుతం దేశంలోని కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరిగా ఉంటూ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా ఉన్నారు.ప్రజాపాలనలో ప్రథమ సంవత్సరం అంటూ విజయోత్సవ వేడుకలకు సిద్ధమవుతూ రేవంత్ మార్క్ తో కూడిన “మార్పు మొదలైందంటూ” దూకుడుగా వెళుతున్నారు.ప్రభుత్వ వేదికలపై ముఖ్యమంత్రిగా హుందాగా వుంటూనే, రాజకీయ వేదికలపై మాత్రం తనదైన శైలిలోనే ప్రసంగిస్తూ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తూ వినిపిస్తున్నారు.కొన్ని సందర్భాల్లో కెసిఆర్, కెటిఆర్ తదితరుల వంటి వారిపై ఆయన వాడిన భాష కూడా చర్చనీయాంశం అవుతోంది.ఉచిత బస్సు ప్రయాణం,రూ.500కే గ్యాస్ సిలిండర్,గృహాజ్యోతి ‘0’ బిల్లు,ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలు, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలతో పేద ప్రజల కు రేవంత్   అండగా ఉన్నారు.ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల పై ఆయన చూపిన చొరవ ప్రత్యేకం. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ తో పాటు డిఎస్సీ, గ్రూప్ పరీక్షల నిర్వహణ మరియు పోస్టుల భర్తీ వంటి అంశాల్లో చాలా కీలకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే రే’వంత్’ వన్ మ్యాన్ షో చూపిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.మళ్ళీ వొచ్చే లోక్ సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, రాహుల్ గాంధీ ని ప్రధానిగా చూడటమే తన లక్ష్యమని కాంగ్రెస్ కార్యకర్తలకు,నాయకులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు,మూసీ మరియు లగచర్ల ఘటనల విషయంలో వొచ్చిన ప్రశంసలతో పాటు విమర్శలు రెండింటికీ ధీటుగానే స్పందిస్తున్నారు.సమగ్ర కుటుంబ సర్వేతో “బిసీల రాజ్యాధికారం”తో నడుస్తున్న రాజకీయంలో వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఉపముఖ్యమంత్రి హోదాలో భట్టి విక్రమార్క మరియు మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు కూడా రేవంత్ మార్గంలోనే నడుస్తూ, ప్రస్తుతం రాజకీయ విమర్శలకు వెళ్ళకుండా తమ పని తాము సమర్ధవంతంగా  చేసుకుంటున్నారు.
    ఆరు గ్యారంటీ ల అమలు పేరుతో పేద ప్రజలను నమ్మించి వోట్లు వేయించుకొని కాలయాపన చేస్తున్నారని,రైతు రుణమాఫీ లో అందరికీ న్యాయం జరగలేదని ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ గట్టిగానే విమర్శలు గుప్పిస్తుంది. దాదాపు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నుంచి నేడు కెటిఆర్ మరియు హరీష్ రావు లు ప్రతిపక్షం హోదాలో విన్నూతమైన విధానాలతో పోరాడుతూ తమ కార్యకర్తలకు, నాయకులకు వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వొస్తుందనే ధీమాను వ్యక్తపరుస్తున్నారు.ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలు,రైతుల సమస్యలు,మూసీ మరియు లగచర్ల ఘటనల వంటి అంశాల్లో రేవంత్ మాదిరిగానే దూకుడుగా వ్యవహారిస్తూ మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. రేవంత్ చర్యలకు హరీష్ తనదైన సున్నితమైన శైలిలో స్పందిస్తుండగా ఈ మధ్య కెటిఆర్ మాత్రం “తగ్గేదే..లే” అనే విధంగా ముందుకెళ్తున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ బిఆర్ఎస్ మధ్య పోస్టులు, కామెంట్స్ హద్దులు మీరుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక భవిష్యత్తులో కెటిఆర్ మరియు హరీష్ లు ఎలాంటి వ్యూహాలతో ప్రజాసమస్యలపై పోరాడుతారో, కార్యకర్తలకు అండదండగా వుంటారో, రాజకీయ చదరంగంలో ఏ పాత్ర పోషిస్తారో కాలమే నిర్ణయించాలి.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరియు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ “దొందూ దొందే” అంటూ తెలంగాణ లో భవిష్యత్తు అధికారం మాదే అంటూ భాజాపా కూడా ధీటుగానే రాజకీయ పావులు కదుపుతుంది. కేంద్రమంత్రి మరియు ప్రస్తుత భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తనదైన పంథాలో మోదీ చరిష్మాతో తమ కార్యకర్తలకు మరియు నాయకులకు భరోసా కల్పిస్తున్నారు.కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో “మేము సైతం” అంటూ కిషన్ రెడ్డి తో పాటు బండి సంజయ్,ఈటల రాజేందర్, అరవింద్ వంటివారు కూడా దూకుడుగానే వ్యవహారిస్తూ ప్రజల మధ్యలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు భాజపా త్రిముఖ పోటీలో ఎవ్వరికీ వారు తమ విధానాలతో, భవిష్యత్తు అంచనాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.వీటితోపాటు కేసీఆర్ మౌనం,బిసీల వాటా పెంపు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, రాజకీయ నాయకుల అరెస్టు లు వంటి తదితర అంశాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగానే కనిపిస్తున్నాయి.ప్రజా సమస్యలపై అన్ని పార్టీల స్పందనలు ఎలా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఈ ప్రముఖ నాయకుల ప్రసంగాల్లోని కొన్ని కామెంట్లు, చేష్టలు సామాన్య ప్రజలు సైతం అసహ్యించుకునే స్థాయిలో ఉంటున్నాయి.ప్రజాప్రతినిధులమని మరచి వ్యక్తిగత దూషణలతో, ద్వేషపూరిత చర్యలతో వాళ్ళు అనుసరిస్తున్న వైఖరులు, విధానాలు, సోషల్ మీడియా వార్ లు ఆందోళనకరంగా ఉంటున్నాయి .కాబట్టి అన్ని పార్టీల నాయకులు జాతీయ సమగ్రతను కాపాడుతూ, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరుకుందాం.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇస్తున్న అధికారం,జీతం రెండూ అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు బాధ్యతగా వుంటూ ప్రజాసమస్యలపై సేవాభావంతో పని చేయాలి.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరియు మంత్రిమండలి,ప్రతిపక్ష నాయకులుగా కెటిఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి తదితరులంతా ఈ “రాజకీయ పోటీ” ప్రపంచంలో పార్టీల, వ్యక్తిగత భవిష్యత్తులను పక్కనబెట్టి  దేశం మరియు రాష్ట్రంలో రాబోయే తరాల భవిష్యత్తు ప్రపంచానికి ధీటుగా ఉండేలా కృషి చేయాలని ఆశిద్దాం.అందరికీ అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్య మరియు వైద్యం తో పాటు సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని గుర్తు చేద్దాం.
ఫిజిక్స్ అరుణ్ కుమార్ 
9394749536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *