– కార్పొరేటర్ టికెట్ ఆశావహులతో మంత్రుల ముఖాముఖి
కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 28: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయడమే మా ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం అధ్యక్షతన డీసీసీ కార్యాలయం (ఇందిరా గార్డెన్స్)లో బుధవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని మంత్రి దుద్దిళ్ల అన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గాని, నాకు గాని, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు గాని ఉన్నది ఒకటే ఇంట్రెస్ట్.. అది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయడమేనని అన్నారు. గెలిచే అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియలో తామంతా ఒకే మాట మీద ఉంటామన్నారు. ఆ విధమైన ప్రయత్నంలో మీ అందరి సహకారం తీసుకుంటామని చెప్పారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నామన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని తెలిపారు. 70 శాతం మంది కార్యకర్తలను మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించుకున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కష్టపడ్డ ప్రతి కార్యకర్తను నామినేటెడ్ పదవుల్లో నియమించి వారికి న్యాయం చేసే విధంగా జిల్లా నాయకత్వం కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవలసిన అవసరం ఉందన్నారు. అన్ని కార్పొరేషన్ల కంటే అత్యధిక ప్రాధాన్యత కలిగిన కార్పొరేషన్ కరీంనగర్ అని, ప్రతి వారి దరఖాస్తును పరిశీలిస్తామని, ఎవరికి ఎలాంటి అపోహలు వద్దని చెప్పారు. పార్టీకి, ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమైన జిల్లా ఇది.. కార్యకర్తల మనోభావాలకు తగట్టుగానే అధిష్టానం ముందుకు వెళ్తుందన్నారు.
సమగ్ర ప్రణాళికతో పట్టణాల అభివృద్ధి
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, అభ్యర్థుల ఎంపికకు 66 సీట్లలో సర్వే జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ప్రజా పాలనపై ప్రజలు పాజిటివ్‌గా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సెలెక్ట్ ఎలెక్ట్ ద్వారా మీకు మీరే వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రెండేళ్ల క్రితం కార్యకర్తల రెక్కల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేస్తూ కార్యకర్తలు కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా గెలవదో చూద్దామన్నారు. ఎదుటి పార్టీని ఢీకొనాలంటే ఎలాంటి అభ్యర్థికి, ఏ సామాజికవర్గం వారికి టికెట్ ఇవ్వాలి అనే విషయాన్ని పార్టీ ఆలోచిస్తున్నదని ఆయన చెప్పారు. ఆరు సీట్లకు ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వం 66 సీట్లకు తీసుకొచ్చిందన్నారు. మనమంతా కష్టపడితే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదన్నారు. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్త కష్టాన్ని గుర్తిస్తామని, టికెట్ ఎవరికి ఇచ్చినప్పటికీ కార్యకర్తలు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70శాతం సీట్లను గెలుచుకుందని, అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ పాలనను ప్రతిపక్షాలకు చూపించాలని కోరారు. కార్యక్రమంలో ‘సుడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. అలాగే జిల్లాకు చెందిన రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్పొరేషన్ పరిధిలోని ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల విభాగాల అధ్యక్షులు, టికెట్ ఆశావహులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



