నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు

– యువతకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల సూచ‌న‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: భవిష్యత్‌ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచుకోగలిగితేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించిన వారే తమ వృత్తుల్లో నిలదొక్కుకోగలుతారన్నారు. టీ-వర్క్స్‌ ప్రాంగణంలో ‘పాత్‌ వే టు తైవాన్‌’ పేరుతో తైవాన్‌లో ఉద్యోగాల కల్పనకు బేధవారం జరిగిన మొదటి రౌండ్‌ ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ-వర్క్స్‌ సీఈవో జోగిందర్‌ తనికెళ్ల, తైవాన్‌ ప్రభుత్వ సంస్థ టేలెంట్‌ తైవాన్‌ ప్రతినిధి ఈడెన్‌ లియెన్‌లు మంత్రి సమక్షంలో ఉద్యోగాల కల్పన, ఉన్నత విద్యా కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయు)పై సంతకాలు చేశారు. తైవాన్‌కు చెందిన రియల్‌ టెక్‌, లాజిటెక్‌, మీడియాటెక్‌, విస్ట్రాన్‌, హిమాక్స్‌, కౌపాంగ్‌, ఐటీిఆర్‌ఐ ఇందుకు ముందుకొచ్చాయి. ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడి విద్యార్థులను తైవాన్‌ కంపెనీలు ప్రాధమిక ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని తదుపరి దశలో తైవాన్‌కు ఆహ్వానిస్తాయి. మొదటి విడతగా 20 ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులు తొలిదశ ఇంటర్వ్యూల కోసం హాజరయ్యారు. తైవాన్‌ కంపెనీలు ప్రతిభావంతుల వేటలో దేశంలో తెలంగాణను ఎంపిక చేసుకున్నందుకు శ్రీధర్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. తొలిదశ ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆరు నెలలపాటు ఇక్కడ (చైనీస్‌) మాండరిన్‌ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ భాష, సాంకేతిక పరిజ్ణానాల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు తైవాన్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారని ఆయన తెలిపారు. దీని కోసం ఎనిమిది తైవాన్‌ కంపెనీలు ఇక్కడికి వచ్చినట్టు వెల్లడిరచారు. ఈ సందర్భంగా హెచ్‌ డి ఎఫ్‌ సి (%నణఖీజ%) బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకటేశ్‌ చల్లవర్‌ తమ పరివర్తన్‌ (సీఎస్‌ఆర్‌) ఫండ్‌ కింద టీ-వర్క్స్‌ ఫౌండేషన్‌కు రూ.1.5 కోట్ల నిధులను సమకూర్చనున్నట్టు శ్రీధర్‌బాబు సమక్షంలో ప్రకటించారు. దీన్ని పర్యావరణ అనుకూల విధానాల్లో వస్తూత్పత్తి, ఆవిష్కరణలు చేసే అంకుర సంస్థలకు సహాయ నిధిగా అందజేస్తారు. కేవలం 2.2 కోట్ల జనాభా ఉన్న తైవాన్‌ చిప్‌ల తయారీ, టెక్నాలజీ రంగాల్లో ప్రపంచమంతా ఆధారపడే స్థాయికి ఎదిగిందన్నారు.. భవిష్యత్తు టెక్నాలజీల గురించి తైవాన్‌ ముందు చూపు, శ్రమించే తత్వాన్ని తెలంగాణ యువత ఆదర్శంగా తీసుకోవాలని శ్రీధర్‌బాబు సూచించారు. ప్రపంచ అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా అనువర్తనం చెందడం వల్లే తైవాన్‌కు ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. కార్యక్రమంలో తైవానీస్‌ యూనివర్సిటీలు తమ విద్యాసంస్థల ప్రాముఖ్యతను వివరించే స్టాళ్లను ఏర్పాటు చేశాయి. 12వ తరగతి, డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు తమ యూనివర్సిటీల్లో చేరితే వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని యూనివర్సిటీల ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో టీ-హబ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ టి.ఎం.ప్రవీణ్‌ కుమార్‌, తైవాన్‌ ప్రభుత్వ సంస్థ టేలెంట్‌ తైవాన్‌ సీఈవో జోనాథన్‌ లియావో, ప్రతినిధులు టెర్రా లిన్‌, ఇడెన్‌ లియెన్‌, హైదరాబాద్‌ ఐఐటీ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ శివరామకృష్ణ వంజరి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *