కేంద్రంపై బురద చల్లుతున్నాయ్‌

– యూపీఏ చ‌ట్టంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం
– త‌ప్పులు క‌ప్పిపుచ్చుకుంటున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ లు
– జాతీయ అబ‌ద్ధాల పోటీలు పెడితే వాటికి అవార్డులు ఖాయం
– వాళ్ల‌ త‌ప్పిదాల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి
– బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 2: కృష్ణా జలాల వాటా పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు చేసిన అన్యాయాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురద చల్లుతున్నాయ‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమ‌ర్శించారు. ఈమేర‌కు హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో జాతీయ అబద్దాల పోటీలు’ నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మొదటి రెండు అవార్డులు ఖాయం అంటూ తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ వేదికగా దూషణలు, అబద్దాలతో పచ్చి రాజకీయం చేస్తున్నారని, తమ తప్పిదాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

యూపీఏ చట్టంతో మొదటి అన్యాయం

రాష్ట్ర విభజన చట్టం-2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కృష్ణా జలాల వాటా పంపిణీకి సంబంధించి బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను టచ్ చేయరాదు అని సెక్షన్ 89 చేర్చి తెలంగాణకు అన్యాయం చేసిందని బండి సంజయ్ తెలిపారు. నాటి నీటి కేటాయింపులపై పరిశీలన చేసే అవకాశం కొత్త ట్రైబ్యునల్‌కు లేకపోవడంవల్ల తీరని అన్యాయం జరిగిందని వివరించారు. మోదీ ప్రభుత్వం 2023 అక్టోబర్ 6న కొత్త ట్రైబ్యునల్‌కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజన చేసే అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్‌, లీగల్‌ వాదనలు సమర్థంగా వినిపించే అంశంపై దృష్టి సారించకుండా స్వార్ధ రాజకీయ లబ్డి కోసం అడ్డగోలుగా మాట్లాడుతుండటం త‌గ‌ద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించకపోతే ఈ అవకాశం కూడా కోల్పోతాం అని హెచ్చరించారు.

811 టీఎంసీల‌లో తెలంగాణ‌కు 299 మాత్రమే

811 టీఎంసీల‌ కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు దక్కాల్సి ఉండగా కేసీఆర్ ప్రభుత్వం 2015 జూన్ 19న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 299 టీఎంసీలు చాలని ఒప్పందం చేసుకుని తెలంగాణకు రావాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి ధారాదత్తం చేశార‌ని, ఆ ఒప్పంద పత్రాలను బయటపెట్టింది తానేన‌ని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రాజెక్టుకు ఏపీకి సహాయం చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సింది పోయి ప్రజలను గందరగోళంలోకి నెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయం చేస్తున్నాయ‌న్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాల్సిన పవిత్రమైన అసెంబ్లీని స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గు చేటన్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా ఆనాడు కేసీఆర్ పట్టించుకోలేదు.. ఈ అంశాన్ని వివరిస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ 2020 మే 12న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేంద్ర జలశక్తికి నేను లేఖ రాశాను. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెంటనే స్పందించి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందేదాకా ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని కృష్ణా బోర్డును కోరితే ఆ బోర్డు (కేఆర్ెంబీ) తెలంగాణ చట్టబద్ధమైన ప్రయోజనాలను కాపాడాలని ఏపీ ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖలు (15 మే 2020, 20 మే 2020, 16 జూన్ 2020, 1 జూలై 2020 మరియు 30 జూలై 2020 తేదీల్లో) రాసింది. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో కనీసం కేంద్రానికి లేఖ రాయలేదు. సాయం కోరలేదు అని స్ప‌ష్టం చేశారు. మళ్లీ 2020 జూలై 29న లేఖ రాసి అపెక్స్ కౌన్సిల్ సమావేశం (ఆగస్టు 5) ఏర్పాటు చేయమని కోరగా కేసీఆర్ వెళ్లకుండా వాయిదా వేయించారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసులతో ఎనిమిదేళ్లు జాప్యం చేసింది కేసీఆరేనని చెప్పారు.

పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ వెనక్కు.. నిర్లక్ష్యమే కారణం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం అడిగిన 90 టీఎంసీ నీటి వివరాలు ఇవ్వకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, సమగ్ర వివరాలు, కేంద్ర గైడ్‌లైన్స్‌తో డీపీఆర్ పంపకపోవడంవల్ల తిరిగి పంపిందని తెలిపారు. గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం పోలవరం ద్వారా 45 టీఎంసీలు ఎగువ ప్రాంతానికి, మిగిలినవి పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించాలని కేంద్రం సూచించిందని వివరించారు. కేంద్ర జలవనరుల సంఘం (సీడ‌బ్ల్యూసీ) వివరాలు పంపితే డీపీఆర్ ఆమోదమవుతుంది, 60% నిధులు వస్తాయి” అని బండి సంజ‌య్ చెప్పారు. హరీష్ రావు ఆరోపణలు రాజకీయ అవగాహనారహిత్యం అని అన్నారు.. అసెంబ్లీలో తిట్లు మాని సరిదిద్దుకుని తెలంగాణ హక్కులు సాధించుకోవాలి. కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది అని కేంద్ర మంత్రి రెండు పార్టీల‌కూ సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *