కథ : ఒద్దిరాజు మురళీధర్ రావు
ఒకసారి ఒకరాజు గారి మనసులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. మొదటిది, ఏ పని ఏ ముహుర్తాన ప్రారంభించాలి. రెండవది. ఎవరి సలహా పాటించాలి, ఎవరి సలహా పాటించగూడదు. మూడవది, ఏ పని మంచిది. ఈ మూడు ప్రశ్నలకు సరియైన సమాధానాలు లభిస్తే తనకు ఏ విషయంలో అపజయం ఉండదనుకున్నాడు. వాటి కొరకు రాజ్యంలో ప్రకటనలు చేయించాడు. ఏ పనికి ఏ ముహూర్తం మంచిదో పంచాంగములో చూసి సమయము, తేదీ, మాసముల పట్టిక వ్రాసుకోవడం, దాని ప్రకారం పనులు ప్రారంభించడం మంచిదని ఒకరి సలహా. కాని, ప్రతి పని ముందు చెప్పిరాదు కాబట్టి వివేకవంతుల సలహా అనుసరించడం ఉచితమని ఒకరి అభిప్రాయం. ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుందోమొదటే తెలుసుకునేందుకు మాంత్రికుడిని విచారించాలని ఒకరి సలహా.
ఇక రెండవ ప్రశ్న కొరకు కూడా అనేక జవాబులు వచ్చినవి. రాజుగారికి ఎల్లప్పుడు కావలసినది మంచి సలహాదారులు, పూజార్లు, డాక్టర్లు, అందరికన్న ముఖ్యులు యుద్ధవీరులు అని ఎవరికి తోచినట్లు వారు తెలిపారు. ఇక మూడవ ప్రశ్నకు జవాబు-వైజ్ఞానిక విషయములు (సైన్సు), యుద్ధనైపుణ్యం, పూజలు అని అనేక అభిప్రా యాలు తెలిపారు. రాజుగారికి ప్రశ్నలకు తృప్తికరమైన జవాబులు దొరకలేదు. విచారించగా విచారించగా ఆ ప్రాంతపు అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు, అతని దగ్గరకు వెళ్లితే సరియైన జవాబులు దొరకగలవని తెలిసింది. కాని, ఆ సన్యాసి పేదసాదలకే సమాధానాలు, సలహాలు యిస్తాడని తెలిసి, రాజు తన అంగరక్షకులను వెంట తీసుకొని ఆ సన్యాసి కుటీరానికి దూరంలో గుఱ్ఱం దిగి, అంగరక్షకులను అక్కడే వదిలి ఒంటరిగా సాధారణ వేషంలో సన్యాసి దగ్గరకు వెళ్ళాడు.
ఆ సన్యాసి చాలా ముదుసలి, బక్కచిక్కి శక్తిహీనుడుగ వున్నాడు. అయినా కష్టంతో చెట్లపాదులు తవ్వుతూ కనిపించాడు. రాజు ఆయనకు నమస్కరించి తన ప్రశ్నలకు సమాధానాలడిగాడు. ఆ ప్రశ్నలు విని సన్యాసి మరల తన పనిలో నిమగ్నుడయినాడు. శక్తిలేక కొద్దికొద్దిగా మట్టి తవ్వితీస్తున్నాడు. చెమటలు కారుతున్నాయి. ఆయన పరిస్థితి చూసిన రాజుకు జాలి కలిగింది. సన్యాసిని కూర్చోబెట్టి తనే ఆ పాదు తవ్వడం పూర్తిచేసి తన ప్రశ్నల గురించి మరల అడిగాడు. సమాధానమివ్వక సన్యాసి మరల పాఱ తీసుకొని పనికి ఉపక్రమించబోయాడు. అది చూసి రాజు ఆ పాదులన్ని తవ్వడం పూర్తిచేశాడు. అది సూర్యాస్తమయ సమయం.
అప్పుడు రాజు సన్యాసిని మరల ప్రశ్నలకు సమాధానాలడిగి, చెప్పడం ఇష్టం లేకపోతే తిరిగి వెళ్ళి పోగలనని అన్నాడు. అదే సమయాన అటు దూరం నుండి ఎవరో వస్తున్నాడని సన్యాసి అన్నాడు. ఆ మనిషి గడ్డంతో వుండి, కడుపు మీద కలిగిన గాయంపై చెయ్యి వత్తి పట్టుకుని పరుగెత్తుతూ వచ్చి ‘‘రక్షించండి రక్షించండి’’ అని రాజు వద్ద పడి స్పృహ కోల్పోయాడు. రాజు ఆ రక్తపు గాయాన్ని చూసి జాలిపడి వెంటనే తన చేతిరుమాలుతో కడిగీ కడిగీ రక్త స్రావాన్ని అరికట్టించి, సన్యాసి వద్దవున్న తువ్వాలుతో కట్టుగట్టి, సన్యాసి సహాయంతో కుటీరం లోపలికి చేర్చాడు. ఆ మనిషి స్పృహ నుండి తేరుకుని తాగేందుకు ఏదైన యివ్వమని అడిగాడు. రాజు అతనికి శు భ్రమైన నీరు అందించాడు. ఆ రోజు కొంత దూరం నడవడం వలన, పాదులు తవ్వడం వలన అలసిపోయి అక్కడనే నేలపై వాలి నిద్రపోయాడు రాజు.
తెల్లవారిన తరువాత గడ్డం మనిషి రాజుకు నమస్కరించి క్షమించుమని కోరాడు. ‘‘ఎందుకు క్షమాపణ, ఏం తప్పు చేశావని, అయినా నాకు క్షమాపణ ఏమిటి, నేను నీకు, నీవు నాకు తెలియదు గదా’’ అన్నాడు రాజు. ‘‘మీరు రాజని నాకు తెలుసు. మీరు నా అన్నగారి శిరచ్ఛేదన చేయించి, అతని ఆస్తిని వశపరచుకున్నారు. అందుకొరకు మీపై పగ తీర్చుకోడానికి పథకం వేసుకొని, మీరు సన్యాసి వద్ద నుండి ఒంటరిగా తిరిగి వస్తున్నప్పుడు దారిలో మిమ్ము హత్య చేద్దామని చెట్లగుబుర్లో వేచి చూశాను. సాయంత్రం వరకు మీరు తిరిగి రాకపోవడంతో నేనే బయటికి వచ్చేశాను. అప్పుడు మీ అంగరక్షకులు నాపై దాడి చేసి గాయపరిచారు. నేను ఎట్లో తప్పించుకొని ఇక్కడికి తీవ్రగాయంతో చేరాను. చంపుదామని వచ్చిన నన్ను మీరు కాపాడి ప్రాణ భిక్ష పెట్టారు. అందుకే క్షమాపణ కోరా’’ నన్నాడు. అంతేగాక ఇకముందు కూడా మీకు నమ్మిన బంటుగా మీ సేవలో వుంటానని, తన కుమారులను కూడా మీ సేవలోనే నియమిస్తానని వాగ్దానం చేశాడు. ఈ తీరుగా రాజుగారికి మిత్రుడైనాడు. సునాయాసంగా శత్రుత్వం పోయి మిత్రత్వం ఏర్పడింది. రాజు కూడా సంతోషించాడు, తృప్తి చెందాడు.
సన్యాసిని రాజు మరల సమాధానం కోరాడు. నీకు సమాధానం దొరికింది గదా అని సన్యాసి బదులు చెప్పాడు. అది ఎట్లా అంటావా, విను.
నా బలహీనతపై నీకు జాలి కలిగివుండకపోతే నా కొరకు ఈ పాదులు తవ్వకుండా వెళ్లిపోయి వుంటే, ఆ మనిషి నీ పై దాడి చేసేవాడు. ఇక్కడ ఆగనందుకు పశ్చాత్తాపపడే వాడివి. కాబట్టి చాలా ముఖ్యమైన సమయం పాదులు తవ్వడం. నేను ముఖ్యమైన మనిషిని, నాకు సహాయ పడటం చాలా ముఖ్యకార్యం. తరువాత ఆ గడ్డం మనిషి మన వద్దకు వచ్చిన వెంటనే అతని గాయానికి కట్టుకట్టడం (మంచి ముహూర్తం కొరకు చూడక) ముఖ్యమైన సమయం. ఎందుకంటె నీవు కట్టుకట్టకపోతే అతనితో శాంతి కుదిరే అవకాశం చేయిజారిపోయేది. అతను చాలా ముఖ్యమైన మనిషి అతనికి సహాయ పడటం ముఖ్యమైన కార్యం. భగవంతుడు మనలను భూమిపైకి తీసుక వచ్చినది ఇతరులకు సహాయం చేయడం కోసం.
జ్ఞాపకం వుంచుకోదగినవి :
ముఖ్యమైన సమయం ఇప్పుడే మనలో శక్తివున్నప్పుడే
మన ఎదుట వున్న మనిషే ముఖ్యమైన వ్యక్తి :
ఇతరులకు సహాయం చేయడమే ముఖ్యకార్యం
పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనమ్.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల