ప్రజాపాలన అందిస్తుంటే విషం చిమ్ముతున్నారు

– ఓ కుటుంబం మొత్తం ప్రభుత్వం పడిపోవాలని చూస్తోంది
– అభివృద్ధి పనులకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు చేశాం
– ఇచ్చిన హా మేరకు తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మది
– పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు
– బిజెపి అధ్యక్షుడు పాలమూరుకు వొచ్చి హాలపై మాట్లాడలేదు
– బిజెపికి ఈ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాకుండా చేస్తాం
– కరీంనగర్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్‌
‌- పార్టీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో కలసి పనిచేయాలని హితవు
కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర,ఫిబ్రవరి 5: ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన అందిస్తుంటే కొందరు విషం చిమ్ముతున్నారని సిఎం రేవంత్‌ ‌మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దిగిపోవాలని కుటుంబం మొత్తం దాడికి దిగుతోందని పరోక్షంగా కెసిఆర్‌ ‌కుటుంబంపై ఆరోపణలు చేశారు.  రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌ ‌జిల్లా గుమ్లాపూర్‌లో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గుమ్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియాగాంధీ కరీంనగర్‌ ‌గడ్డపై నుంచి మాట ఇచ్చారు. ఏపీలో పార్టీ అధికారం కోల్పోయినా మాట తప్పకుండా రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణను కాంగ్రెస్‌ ఇచ్చినా బీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారు. ప్రజా తీర్పును కాంగ్రెస్‌ ‌పార్టీ శిరసావహించింది. పదేళ్లలో పన్నుల రూపంలో రూ.20లక్షల కోట్లు ప్రజలు ప్రభుత్వానికి కట్టారు. కానీ, పదేళ్లలో పేదలకు రెండు పడక గదుల ఇళ్లు కూడా కట్టించలేదు.
ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు
కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మున్సిపల్‌ ఎన్నికలు వచ్చాయి. పాలమూరు జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చారు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు, మెట్రో రైలు మంజూరు చేయలేదు..మూసీకి నిధులు ఇవ్వలేదు. రీజినల్‌ ‌రింగ్‌రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు. ఇవే ఇవ్వకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. దేశంలోని బీజేపీ అగ్రనేతలందరినీ ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చినా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తారా? కాంగ్రెస్‌ ‌సత్తా ఏంటో బీజేపీకు చూపిస్తాం అని రేవంత్‌ అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌బంధం ఫెవికాల్‌ ‌బంధం కాదా?. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ వోట్లు, సీట్లు దానం చేసి 8 చోట్ల బీజేపీ ఎంపీలను గెలిపించారు. 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయినా తామే గెలుస్తామని బీఆర్‌ఎస్‌ ‌రంకెలేస్తోంది. బీఆర్‌ఎస్‌ ‌రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలోనూ కూలేశ్వరం అయింది. కాళేశ్వరాన్ని బీఆర్‌ఎస్‌ ఏటీఎంలా వాడుకుందని మోదీ, అమిత్‌ ‌షా స్వయంగా చెప్పారు. కానీ, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదు. దీనిపై కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, ‌కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్‌ ‌చేశారు. రాజకీయాల్లో డబ్బులతో కాదు.. నమ్మకంతోనే గెలుస్తామని మున్సిపల్‌ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. ’ప్రజలకు నమ్మకం కలిగించండి.. అదొక్కటే మిమ్మల్ని గెలిపిస్తుంది’ అని వారికి స్పష్టం చేశారు.
ఇవి కార్యకర్తల ఎన్నిక
కరీంనగర్‌లో మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సమావేశమయ్యారు. ఇవి కార్యకర్తల ఎన్నికలని, కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చినప్పుడే పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు సూచించారు. ఈ రెండేళ్లల్లో ఎన్నో సంక్షేమ పథకాలను అందించామని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు. అధికార పార్టీలో టికెట్‌ ఆశించే వాళ్లు ఎక్కువగా ఉండటం సహజమని, ఎంతోమంది పోటీ పడ్డా పార్టీ బీఫామ్‌ ‌దక్కడం అదృష్టమని అభ్యర్థులకు సోదాహరణగా వివరించారు. ఒక్క వోటు.. గెలుపు వోటములను నిర్ణయిస్తుందని సీఎం రేవంత్‌ ‌పేర్కొన్నారు. టికెట్‌ ‌రాని వారిని కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటూ అభ్యర్థలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం రేషన్‌ ‌కార్డులు ఇవ్వకపోయినా మన ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు అందించామని చెప్పుకొచ్చారు. పేదలకు సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అం‌దించామని వివరించారు. మహిళా గ్రూపులకు సున్నా వడ్డీ రుణాలు అందించామన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అమలు చేసిన పథకాలతోపాటు వాటి వల్ల చేకూరిన లబ్దిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పాల్సిన పనిలేదని.. ప్రభుత్వం చేసిందే ప్రజలకు చెప్పండంటూ సీఎం రేవంత్‌ ‌సూచించారు. సభలో మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, ‌తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *