– మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది
– అంతర్గత విషయాలు బయట మాట్లాడడం సరికాదు
– అన్ని పార్టీల్లోనూ కోవర్టులు సహజం
– మా పార్టీలోనూ రేవంత్ కోవర్టులు ఉంటే ఉండొచ్చు
– బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్
ఎమ్మెల్సీ కవిత లేఖపై డియా సమావేశంలో స్పందించిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ అధినేతకు సూచనలు చేయాలనుకుంటే లేఖలు రాయవచ్చునని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. పార్టీ అధినేతకు లేఖలు రాస్తే తప్పేమి కాదన్నారు. అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించారు. అంతర్గతంగా మాట్లాడే అంశాలు బయట మాట్లాడటం సరికాదని, పార్టీలో అందరం కార్యకర్తలమే, ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, కోవర్టులు సమయం వచ్చినప్పుడు వారే బయటపడతారని పేర్కొన్నారు. అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉంటారని, తమ పార్టీలోనూ సిఎం రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండొచ్చునని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు పెట్టాం. అసెంబ్లీలో ఓడిపోయాం. ఎలా ముందుకు పోవాలని 17 రోజుల పాటు వేల మంది కార్యకర్తలతో చర్చించాం.
ఆ ప్రాసెస్‌లో చాలా మంది డైరెక్ట్‌గా మైక్‌లో మాట్లాడిన వారు ఉన్నారు. కొంత మంది చిట్టీలపై రాసిచ్చిన వారు ఉన్నారు. కొంత మంది కేసీఆర్‌కు లేఖలు ఇచ్చిన వారు ఉన్నారు. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. మా పార్టీ అధ్యక్షుడికి ఏవైనా సూచనలు చేయాలను కుంటే లేఖలు రాయొచ్చు. పార్టీలో ఏ హోదాలో ఉన్నా.. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంది. ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వారిని కూడా కలిసే అవకాశం ఉంది. అంతర్గతంగా మాట్లాడాలన్న అంశం అందరికీ వర్తిస్తుంది. అని కేటీఆర్ అన్నారు. హైకమాండ్ కు డబ్బులిస్తూ రేవంత్ పదవి కాపాడుకుంటున్నారని, ఇడి ఛార్జ్‌షీట్‌లో పేరున్న రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.
నాడు వోటుకు నోటు స్కామ్.. ఇది సీటుకు రూటు స్కామ్ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ దిల్లీ వెళ్లి చీకట్లో బిజెపి నేతల కాళ్లు పట్టుకుంటున్నారని, అమిత్ షాను రాత్రి కలిసిన రేవంత్ బయటికొచ్చిగట్టిగా మాట్లాడారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ పై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, దిల్లీకి చందాలు అని కెటిఆర్ దుయ్యబట్టారు. బిజెపి ఎంపిల భూదందాలకు సిఎం వత్తాసు పలుకుతున్నారని, బిజెపి నేతలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. అందుకే నేషనల్ హెరాల్డ్ కేసుపై నేతలు మాట్లాడట్లేదని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని అంశాలపై కేంద్రం చర్య తీసుకోవాలని కెటిఆర్ కోరారు. కేంద్రం స్పందన కోసం నెలరోజులు ఎదురు చూస్తామని, ఆ తర్వాత పార్టీలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు.





