“చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఐపీఎల్ మ్యాచ్ మాదిరిగా రూపొందుతుందేమోనన్న ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ధనిక ఫ్రాఛైజ్‌లు మంచి క్రీడాకారులను ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తాయి. అదేవిధంగా ఆర్థిక దన్ను ఉన్న పార్టీలు నియోజకవర్గాలను ఏకమొత్తంలో కొనుగోలు చేసి తమవైపు తిప్పుకునే దుస్థితి దాపురించే అవకాశాలే ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి విలువెక్కడ? అటువంటి రోజులు మరెంతో దూరంలో లేవన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం సరిగ్గా ఇటువంటి పతనానికి దారితీసే ఏటవాలుతలంలోనే నిలబడి ఉన్నాం. ప్రస్తుతం మనం పతనంపై హెచ్చరిక దశలో ఉన్నప్పటికీ, రాబోయేకాలంలో నిధుల పేరుతో ఎన్నికలను ఒక వేలంపాట కార్యక్రమంగా మార్చే తరుణం ఇంకెంతో దూరంలో లేదనేది సుస్పష్టం!!”
పన్నుల బెడద, లైసెన్స్, రాజ్యాంగం లేదా చట్టపరమైన ఇబ్బందులు ఏవీ లేకుండా మనదేశంలో తేలిగ్గా అమ్ముకోగలిగే వస్తువు ఏదైనా ఉన్నదంటే అది ‘వోటు’ మాత్రమే! ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికలపై చేసిన ఈ వ్యాఖ్య కేవలం రంధ్రాన్వేషణ కోసం మాత్రమే చేసిందన్న అభిప్రాయం కలగడం సహజం. కానీ రాజ్యాంగం ప్రసాదించిన ఈ వోటు హక్కు రాజకీయ రంగంలో అమ్మకపు వస్తువుగా మారిందనేది మాత్రం నిష్టుర సత్యం! మరోమాటలో చెప్పాలంటే మన ఎన్నికల విధానం పౌర పాలనా పరంగా బలహీనంగా, అనియంత్రిత మార్కెట్ క్షేత్రంలో బలీయంగా పనిచేస్తున్నది. ఈ నియంత్రణలేని మార్కెట్ లో వోటనేది వాగ్దానాలు, బహుమతులు, ప్రత్యేక ప్రయోజనాలకు మార్పిడి వస్తువుగా మారిపోయింది. అంటే అధికారమనేది పలుకుబడి లేదా ధనబలం ఉన్నవారికి మాత్రమే వేలంలో దక్కే వస్తువుగా ప్రజాస్వామ్య వ్యవస్థ రూపుదిద్దుకుంది.
ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి స్థాయి నాయకుడు ఏకంగా తన నియోజకవర్గంలోని పంచాయతీలకు ఒక ఆఫర్ ప్రకటించారు. దీని ప్రకారం తమ పార్టీ బలపరచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీకి నిధులు అందజేస్తామన్నది ఈ ఆఫర్ సారాంశం!! కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని పంచాయతీలు భారతీయ జనతాపార్టీ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, సదరు పంచాయతీలు ఒక్కొక్కదానికి రూ.10లక్షల నిధులు అందజేస్తామని సదరు మంత్రి ప్రకటించారు. అంటే ఖర్మకాలి మరో పార్టీ అభ్యర్థిని ఎన్నుకుంటే, అటువంటి పంచాయతీకి కేంద్ర నిధులు అందబోవన్న పరోక్ష హెచ్చరికగా భావించక తప్పదు. మరోమాటలో చెప్పాలంటే కొత్త నిధులు రావు, కేంద్ర నిధులు వేరే వాటికి మళ్లించే అవకాశమున్నదని ఇతర పార్టీల అభ్యర్థులను ఎన్నుకునే పంచాయతీలకు ముందుగానే యిస్తున్న సూచనగా ఈ ప్రకటనను పరిగణించాల్సి వొస్తున్నది. సదరు ఎంపీ పరిధిలో ప్రాంతీయ అభివృద్ధి కోసం ఖర్చు చేసేందుకు పుష్కలంగా నిధులు ఉన్నట్లే కదా! ఈ కారణంగానే ఆయన తమ పార్టీ అభ్యర్థులను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటే తక్షణం రూ.10లక్షలు ఇస్తానని చెబుతుండవొచ్చు!
ఈ ప్రకటనను పరిశీలిస్తే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ ప్రకటన గుర్తుకొస్తోంది. మాలేగావ్ ప్రాంతంలో ఆయన పర్యటిస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటేనే అభివృద్ధి నిధులను మంజూరు చేస్తామని గ్రామాల ప్రజలను హెచ్చరించారు. మహారాష్ట్రలో కూడా డిసెంబర్ నెలలో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి! హార్స్ ట్రేడింగ్, అభ్యర్థులను, వోట్లను అడ్డగోలుగా కొనుగోలు చేయడమనేది మన దేశంలో మొదట్నుంచీ జరుగుతున్న బాగోతమే! అయితే ఈసారి ఏకంగా ఈ ప్రజాస్వామ్య విధానాన్ని బిడ్డింగ్/ వేలం స్థాయికి దిగజార్చిన ఘనత రాజ్యాంగ పదవుల్లో ఉన్న నాయకులకే దక్కింది! ఇటువంటి ఉన్నతస్థాయి నాయకులు ప్రజాధనాన్ని తమ పలుకుబడి, ప్రయోజనాలకోసం నిస్సిగ్గుగా ఉపయోగిస్తూ, వోటును ఒక నియంత్రణలేని మార్కెట్ వస్తువుగా మార్చేశారు.
వోటు అమ్మకం, నామినేషన్ల ఉపసంహరణకోసం బెదిరింపులు వంటి చర్యల ద్వారా వోటింగ్ ప్రక్రియను నైతిక ఆధారిత ఐచ్ఛిక స్థాయినుంచి పరిణామాత్మక వేలం ప్రక్రియ దశకు దిగజార్చారు. దురభ్యాసం, అవినీతి, డబ్బులు పంపిణీ చేయడం వంటివి మన ప్రజాస్వామ్య ప్రక్రియలో సాధారణమే అయినప్పటికీ, ఆదర్శవాదంతో కూడిన ప్రజాస్వామ్య విలువలను మార్కెట్ శక్తులు హననం చేస్తున్న విధం, ఏకంగా ప్రజల వోట్లను అమ్మకానికి పెట్టే ఒక అనియంత్రిత వస్తువుగా ఏవిధంగా మార్చేశాయో వర్తమాన చరిత్ర స్పష్టం చేస్తున్నది. తెలంగాణ, మహారా ష్ట్రల్లో శక్తివంతమైన నాయకులు అభివృద్ధి నిధుల పేరిట చేస్తున్న ఈ ‘బిడ్డింగ్’ రాజకీయం సామాన్యులకు జగుప్స కలిగిస్తోంది.
అధికారమే పరమావధిగా ఈవిధంగా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్న వైనం, భ్రష్టు పట్టిపోతున్న ప్రజాస్వామ్యాన్నిమరో కోణంలో వీక్షింపజేస్తున్నది. అంతేకాదు శక్తివంతమైన నాయకులు ఈ ‘బిడ్డింగ్’ లో పోటాపోటీగా ఎటువంటి బెరుకు లేకుండా దూసుకు పోతుండటం ఒకింత ఆశ్చర్యం మాత్రమే కాదు ప్రజాస్వామ్య ప్రేమికుల్లో నైరాశ్యాన్ని నింపుతోంది. ముఖ్యంగా మంత్రుల స్థాయి నాయకుల్లో ప్రజాస్వామ్య విలువల పట్ల ఎటువంటి నిబద్ధత కనిపించడం లేదు. అంతేకాదు అన్ని రకాల స్క్రూటినీలకు అతీతులమని, ఎన్నికల సంఘం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుందన్న ధీమా వీరిలో స్పష్టంగా కనిపిస్తోంది.
నియంత్రణా సంస్థలు ఎటువంటి చర్యలు చేపట్టక నిశ్చేష్టంగా లేదా మౌనంగా ఉండిపోవడం రాజకీయ నాయకులు ఈ విధంగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం. అభివృద్ధి నిధుల కేటాయింపుపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించినప్పటికీ, అధికార్ల స్పందన తీరు, సమయం ఆక్షేపణీయంగా ఉండటం గమనార్హం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రూ.10వేలు చొప్పున మహిళల ఖాతాల్లో జమచేసిన వైనాన్ని బిహార్ ఎన్నికల్లో చూశాం. ఎన్నికల సంఘం ఏమీ పట్టనట్టు వ్యవహించిన నేపథ్యం ఇప్పుడు బీజేపీ నేతల్లో ఎక్కడలేని ధైర్యాన్నిచ్చి ఉండవచ్చు. కేవలం ఎన్నికల సంఘం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రస్తుతం బీజేపీ నేతలు ధైర్యంగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మరీ, నిధుల కేటాయింపు పేరుతో ప్రజల బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. ఈ విధంగా రాజకీయ నాయకులు నిధుల హామీ పేరుతో చేస్తున్న ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకోకపోతే, రాబోయే ఎన్నికల్లో ఈ దుష్ప్రభావం మరింత వికృత పోకడలను కారణం కాకూడదనేంలేదు.
చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఐపీఎల్ మ్యాచ్ మాదిరిగా రూపొందుతుందేమోనన్న ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ధనిక ఫ్రాఛైజ్‌లు మంచి క్రీడాకారులను ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తాయి. అదేవిధంగా ఆర్థిక దన్ను ఉన్న పార్టీలు నియోజకవర్గాలను ఏకమొత్తంలో కొనుగోలు చేసి తమవైపు తిప్పుకునే దుస్థితి దాపురించే అవకాశాలే ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి విలువెక్కడ? అటువంటి రోజులు మరెంతో దూరంలో లేవన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం సరిగ్గా ఇటువంటి పతనానికి దారితీసే ఏటవాలుతలంలోనే నిలబడి ఉన్నాం. ప్రస్తుతం మనం పతనంపై హెచ్చరిక దశలో ఉన్నప్పటికీ, రాబోయేకాలంలో నిధుల పేరుతో ఎన్నికలను ఒక వేలంపాట కార్యక్రమంగా మార్చే తరుణం ఇంకెంతో దూరంలో లేదనేది సుస్పష్టం!!





సత్యాన్ని సమాధి చేసే కుట్రలు