తెలంగాణకు బదిలీ చేయడానికి వీలున్న ఉద్యోగులను ముఖ్యంగా ఆంధ్రపదేశ్ నేటివిటీ ఉన్నవారి వివరాలను కూడా సేకరించడానికి ఏపీ ప్రభుత్వం ఉపక్రమించడం తాజాగా తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈవిధంగా తెలంగాణకు బదిలీకోసం దరఖాస్తు చేసుకున్న వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు చెందిన తాజా సమాచారాన్ని తెలంగాణకు పంపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుండ టంతో, ఇక్కడి సిబ్బందిలో తమ ప్రమోషన్ తదితర ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలో ఆ విధంగా దరఖాస్తు చేసుకున్నవారు తమకు సంబంధించిన తాజా వివరాలను ఈనెల 19లోగా అందజేయాలని ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యం ఈ ఆందోళనకు ప్రధాన కారణం. అయితే ఒకే సర్వీసు, ఒకే కేటగిరీకి చెందినవి అయివుండి, స్థానిక ఉద్యోగుల పదోన్నతి ఇతర ప్రయోజనాలకు భంగం వాటిల్లని రీతిలో ఉంటేనే అటువంటి బదిలీలు ఆమోదయోగ్యమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈవిధంగా పొరుగు రాష్ట్రం నుంచి ఉద్యోగుల బదిలీలు జరిగితే తమ సర్వీసు ప్రయోజనాలు, ప్రమోషన్ అవకాశాలకు గండిపడుతుందని తెలంగాణ ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి . ఆంధ్ర నుంచి ఉద్యోగుల ను తీసుకుంటే, తమ కెరీర్‌కు ముప్పు ప్రమాదం వాటిల్లుతుందని తెలంగాణ సిబ్బంది భయం.
అదీ కాకుండా తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లాలనుకునే ఉద్యోగుల సంఖ్య (1369), ఆంధ్రనుంచి తెలంగాణకు రావాలనుకుంటున్నవారి (1808) కంటే చాలా తక్కువగా ఉండటం మరో ప్రధాన సమస్య. ఆ విధంగా ఆంధ్రనుంచి తెలంగాణకు ఉద్యోగుల ప్రవాహం యదేచ్ఛగా కొనసాగితే తమ నియామాకాలకే పెను ముప్పు ఏర్పడుతుందని భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ బదిలీలు ఒక సర్వీస్ లేదా కేటగిరీకి చెందకపోవడం, బదిలీలు కోరుకునేవారు జాయింట్ కమిషనర్, డిప్యూటీ కలెక్టర్ వంటి ఉన్నతస్థాయి అధికారులు కావడం, కొన్ని శాఖల్లో ఉన్నత స్థాయిలను సృష్టించాల్సి వొస్తుందన్న భయం తెలంగాణ ఉద్యోగుల్లో కొనసాగుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి మాత్రమే ఉద్యోగావకాశా లు కల్పించాలన్న లక్ష్యానికి, తెలంగాణ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుంది.
గతంలోని మార్గదర్శకాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య బదిలీ అయ్యే ఉద్యోగులు, తాము జాయిన్ అయ్యే కొత్త కేడర్‌లో చివరి స్థాయి లేదా ర్యాంకును అంగీకరించాల్సి రావడం వల్ల వారు తమ సీనియారిటీ,సర్వీసు తదితర ప్రయోజనాలను కోల్పోక తప్పదు. విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా జూన్, జులైల్లో మాత్రమే బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని రకాల సమస్యలున్నప్పుడు తెలంగాణ స్థానికత కలిగి ఆంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు మాత్రమే అంగీకారం తెలపాలని ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అంతర్ రాష్ట్ర బదిలీలు ఒక సంక్లిష్ట వ్యవహారం కనుక దీన్ని పరిష్కరించడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన దగ్గరినుంచి ఎడతెగని చర్చలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల సంఖ్య 1942 కాగా, తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లేందుకు అప్లై చేసుకున్నవారు 1447. 2024 ఆగస్ట్ నాటికి 122 మంది ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు క్లియరెన్స్ రాగా వీరిలో 61 మంది తెలంగాణలో విధుల్లో చేరిపోయారు. ఇటువంటి బదిలీల సమస్యను ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కరించేందుకోసం మంత్రులు, ఉన్నతస్థాయి అధికార్ల తో కూడిన కమిటీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.
గతంలో జారీచేసిన 317 జీఓ ప్రకారం కేటాయింపు ల్లో చోటుచేసుకున్న ఇబ్బందులను పరిష్కరించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా మూడేళ్ల పాటు డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటువంటి బదిలీలు జరిగినప్పుడు స్థానిక ఉద్యోగుల ప్రమోషన్ అవకాశాలతో పాటు, కొత్త ఖాలీల్లో నియామకాల విషయంలో సమస్యలు ఎదురయ్యాయి. అదీకాకుండా పెద్ద ఎత్తున ఇటువంటి బదిలీలు జరిగినప్పుడు సర్వీసు కండిషన్లు, కేటగిరి మ్యాచింగ్‌ల విషయంలో ఉద్యోగులు కోర్టులను ఆశ్ర యించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రాంత ఉద్యోగుల బదిలీలను తెలంగాణ ఉద్యోగ సంఘాలు మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వొస్తున్నాయి. సర్వీసు, నియామకాల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందనేది వీరు ప్రధానంగా వ్యక్తం చేసిన భయం.
ఎవరైతే ఉద్యోగులు క్రమశిక్షణ చర్యలు లేదా విజిలెన్స్ కు సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్నారో అటువంటివవారు అంతర్ రాష్ట్ర బదిలీలకు దరఖాస్తు చేయడానికి వీల్లేదని కోర్టులు స్పష్టం చేశాయి. వీరి విచారణ పరిధి మారిపోతుండటమే ఇందుకు కారణం. ఇదిలావుండగా బదిలీ అనేది పాలనాపరమైన వ్యవహారం తప్ప, దాన్నొక హక్కుగా భావించడానికి వీల్లేదని కోర్టులు స్పష్టం చేశాయి. అయితే భార్యా భర్తలు ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు కుటుంబ జీవనం, గౌరవం, ప్రైవసీ అంశాలను పరిగణలోకి తీసుకోవొచ్చని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చాలా వరకు అంతర్ రాష్ట్ర బదిలీలకు టీ.ఏ మరియు డీ.ఏలు పొందడానికి అర్హమైనవి కావు.
నిబంధనలు, కోర్టు తీర్పులు ఎలాఉన్నప్పటికీ, రెండు రాష్ట్రాలు విడిపోయి పుష్కరకాలం దాటుతున్నా ఇంకా ఉద్యోగుల బదిలీ విషయంలో ప్రభుత్వాలు ఒక విధాన రూపకల్పనను ఒక కొలిక్కి తీసుకురాకపోవడం గమనార్హం . 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన దగ్గరినుంచి ఇప్పటిరకు ఉద్యోగ నియామకాలు, సర్వీసు, ప్రమోషన్ నిబంధనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవి కావడం వల్ల, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇవి విడదీయడానికి ఇబ్బంది కలిగించే సంక్లిష్ట స్థాయిలో ఉన్నాయన్నది సత్యమే అయినప్పటికీ, పుష్కరకాలం గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నదన్న చందంగా మారడం విచారకరం.