- వేలాదిగా తరలివచ్చిన ప్రజా విప్లవ సానుభూతిపరులు
- జోహార్లతో హోరెత్తిన వెలిశాల
- కన్నీటి పర్యంతమైన విప్లవ సానుభూతిపరులు
- గణేష్ అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ విప్లవ గీతాలు
- నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీలు సిరికొండ తీన్మార్ మల్లన్న అరుణోదయ విమలక్క అమర్ తదితరులు
జయశంకర్ భూపాలపల్లి ప్రజాతంత్ర, జూన్ 20 : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంచలన విప్లవ వీరుడు వెలిశాల ఉద్యమ యోధుడు గాజర్ల రవి (Gajarla Ravi) అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ అంత్యక్రియలు ఎరుపెక్కిన అశ్రు నయనాల మధ్య శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంజయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో సాయంత్రం విప్లవ జోహార్ లా మధ్య ఉద్యమ కెరటానికి నివాళులర్పించి అంత్యక్రియలు నిర్వహించారు.
వేలాదిగా తరలివచ్చిన ప్రజా సంఘాలు, సానుభూతిపరులు..
మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలక నేతగా ఎదిగిన గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉద్యమ చరిత విప్లవోద్యమంలో ఒక విప్లవ అధ్యాయంగా అభివర్ణిస్తూ రాష్ట్రం తో పాటు నాలుగు రాష్ట్రాలకు చెందిన విప్లవ సానుభూతిపరులు ప్రజా సంఘాలు విప్లవ సంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చారు. మారుమూల గ్రామం నుంచి నక్సలైట్ ఉద్యమంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఎదిగిన గాజర్ల రవికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర చత్తీస్గడ్ ఒరిస్సా రాష్ట్రాలతో విడదీయలేని ఉద్యమ సంబంధం నెలకొని ఉంది.వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, సానుభూతిపరులు, మాజీలు కన్నీటి వీడ్కోలు పలికారు. విప్లవ సంఘాలు పాటలతో గణేష్ తో ఉన్న వారి అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆలపించిన విప్లవ గీతాలు వెలిశాల మార్మోగిపోయింది.
భారీగా ట్రాఫిక్ జామ్..
రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు గాజర్ల రవి అంతిమ సంస్కారం యాత్రలో పాల్గొనాలని పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వెలిశాల గ్రామంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వెలిశాల వెళ్లే రహదారులలో వాహనాలరద్దీ కొనసాగింది.
ఎరుపెక్కిన వెలిశాల…..
ఉద్యమాల పోరుగడ్డ కమ్యూనిస్టుల ఉద్యమ శాలగా పేరుగాంచిన వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలయాస్ గణేష్ 33 సంవత్సరాల క్రితం విప్లవోద్యమం బాట పట్టి చివరకు మిగతా జీవిగా అతడి పార్థీవ దేహం గ్రామానికి చేరుకోవడంతో గ్రామమంతా శోకసముద్రమైంది. మావోయిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన గ్రామానికి చెందిన నాయకుడు విగతజీవిగా మారడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గణేష్ మృతదేహం అల్లూరి జిల్లా నుంచి బయలుదేరిందనే సమాచారం మేరకు గ్రామమంతా స్థానికులు, సానుభూతిపరులు, విప్లవ ఉద్యమకారులు ఎర్రజెండాలతో గ్రామాన్ని ఎరుపెక్కించారు. ఊరిలో ఎక్కడ చూసినా ఎర్రజెండాలు రెపరెపలాడాయి.

గంటలపాటు కొనసాగిన అంతియయాత్ర..
గాజర్ల రవి అంతిమ యాత్ర 4 గంటలపాటు కొనసాగింది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన అంతిమయాత్ర శ్మశానవాటిక చేరుకోవడానికి సుమారు నాలుగు గంటలకు పైగా సమయం పట్టడం ప్రజా విప్లవ సంఘాలు నినాదాలు విప్లవ గీతాల ఆలాపనతో వెలిశాల గ్రామం ఎర్రజెండాలతో ఎరుపెక్కింది.
నివాళులర్పించిన ప్రముఖులు
గాజర్ల రవి (Gajarla Ravi) పార్టీ దేహానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్సీలు మధు సూదనాచారి, తీన్మార్ మల్లన్న, అరుణోదయ సాంస్కృతిక సారథి నాయకురాలు విమలక్క కామ్రేడ్ అమర్, గాదె ఇన్నయ్య, గద్దర్ కుమారుడు సూర్యం డాక్టర్ చెరుకు సుధాకర్ గణేష్ నివాళులర్పించారు.
దహన సంస్కారాలు నిర్వహించిన సోదరుడి కుమారుడు..
33 సంవత్సరాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన గాజర్ల రవి మృతదేహానికి అతని సోదరుడి కుమారుడు పవన్ దహన సంస్కారాలు నిర్వహించారు. శ్మశాన వాటికలో చితిపై శవాన్ని ఉంచిన తర్వాత గాజర్ల రవి సోదరులందరూ చితికి నిప్పంటించారు.



