వచ్చే పదేళ్లు అధికారం మనదే

పార్టీ పదవులతోనే నాయకులకు గుర్తింపు
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో చాలా విజయాలు సాధించామని, రాష్ట్రంలో వచ్చే పదేళ్లు అధికారం కాంగ్రెస్‌దేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లు పెరుగబోతున్నాయని, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని తెలిపారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలన్నారు. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మందితో క్రియాశీలక సభ్యత్వం చేయించానని గుర్తుచేశారు. యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలామందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయని ఆయన తెలిపారు. పార్టీ పదవులను తేలిగ్గా తీసుకోవద్దని, వాటితోనే నేతలకు గుర్తింపు, గౌరవమని, రాజకీయాల్లో నేతల ఎదుగుదలకు ఇవి చాలా ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటినుంచే కష్టపడాలని, గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలని, మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ’స్థానిక‘ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. జనగణనలో కులగణన చేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయడంలో మనం విజయం సాధించామని రేవంత్‌ తెలిపారు. ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని అందరం కష్టపడి కాంగ్రెస్‌ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేదని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన ఉద్బోధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *