– నీటిపారుదలపై కె.సి.ఆర్.కున్న అవగాహన మరెవరికీ లేదు
– తెలంగాణ సాధించిన నేత
– రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన నాయకుడు
– చరిత్రలో చిరస్థాయిగా కె.సి.ఆర్. పేరు
– విచారణలు ఆయన్ను ఏమీ చేయలేవు
– బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కేసీఆర్ బలం, జీవన దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు జీవితకాలం కూడా చాలదని కె.టి.ఆర్. అన్నారు. బుధవారం కెసిఆర్ కాళేశ్వరం విచారణకు హాజరయిన సందర్భంగా, బీఆర్‌కే భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కెటీఆర్ మాట్లాడుతూ అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు వందజన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ సాధించిన విజయాల్లో పదోవంతైనా సాధించలేరన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుకను కూడా పీకలేడని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్‌ను విచారణకు పిలిచారంటే. హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటిది.
ఇరిగేషన్‌పై కేసీఆర్‌కు ఉన్న అవగాహన బహుశా ఈ దేశంలోని సమకాలీన రాజకీయ నాయకులలో ఎవరికి ఉండదన్నారు. చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుంది. తెలంగాణను సాధించిన నాయకుడిగా, సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని అనేక కార్యక్రమాలను కేసీఆర్ విజయవంతంగా సాధించారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పోరాటంతో, తెలంగాణ ఆర్తితో తెలంగాణ కోసం కేసీఆర్ పనిచేశారన్నారు. ఉద్యమం ద్వారా కోట్లాది మందికి స్వరాష్ట్ర ఆశయాన్ని సాధించార న్నారు.రేవంత్ రెడ్డి కూలగొట్టడానికి వచ్చాడు తప్ప కట్టడానికి రాలేదు. విధ్వంసకర మైన ఆలోచనలతో పేదల ఇండ్లు కూలగొట్టడం, ప్రాజెక్టులను కూలగొట్టడం. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు తప్ప ఏం చేతకాదనేది స్పష్టమైందన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతామని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ చిల్లర రాజకీయాలను పట్టించుకోవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి. రేవంత్ రెడ్డికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. విచారణల పేరిట రేవంత్ రాక్షసానందం పొందుతున్నారు. నిజం నిలకడగా తేలుతుంది. కొన్ని రోజులు కాళేశ్వరం అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఈ ఫార్ములా అని డ్రామాలు ఆడుతున్నారు. తెలంగాణను తెచ్చింది కేసీఆర్ నాయకత్వం. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్‌ను కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు అని కేటీఆర్ అన్నారు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే.. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే! అని మండిపడ్డారు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం. చివరకు జై కేసీఆర్, జై తెలంగాణ అని కేటీఆర్ నినదించారు. ఈ సందర్భంగా కెటిఆర్ వెంట బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అనేకులు ఉన్నారు.
నిబద్ద రాజకీయనేత: హరీష్ రావు
తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారని పేర్కొన్నారు. ఇతరులు అధికారం వెంటబడితే.. కేసీఆర్ మన జీవితాలను మార్చారు. కాంగ్రెస్ కుట్ర గానీ, విచారణ కమిషన్ గానీ కేసీఆర్ ఘనతను తుడిచిపెట్టలేవని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు సాటిలేనివన్నారు. చివరగా జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినదించారు.




