– కోటిమంది మహిళలు కోటీశ్వరులు కావాలి
– ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తోంది
-మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యం
-రుణాల మంజూరుకు ముందుకొస్తున్న బ్యాంకులు
– ఆర్టీసీకి అద్దెబస్సులిచ్చే స్థాయికి మహిళాసంఘాలు
– ఇదంతా రేవంత్ ప్రభుత్వ విజయం
– మంత్రి సీతక్క
కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలి.. వారందరినీ కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆమె మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్రస్థాయి సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటే కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. కానీ ఇప్పటికే చాలా మండల సమాఖ్యల్లో కోట్ల రూపాయల నిధులు ఉన్నాయన్నారు. మహిళలు కోటీశ్వరులు కావాలన్న కలను నిజం చేసి చూపిస్తున్నామన్నారు. ఇంట్లో ఆడబిడ్డ సంతోషంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుంద ని రేవంత్ రెడ్డి విశ్వసిస్తారన్నారు. అందుకే మహిళలంతా వ్యాపార రంగాల్లో రాణించాలని సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఉచిత బస్సు ప్రయాణం నుంచి.. ఆర్టీసీకి అద్దె బస్సులు ఇచ్చే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయని గుర్తుచేశారు. మహిళా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలను సైతం మహిళా సంఘాలచేత కుట్టిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లకు తగ్గకుండా మహిళా సంఘాలకు బ్యాంకింగ్ రుణాలు ఇప్పిస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయన్నారు. ఎంతోమంది బడాబాబులు బ్యాంకులకు లోన్లు ఎగవేస్తుంటే.. మహిళా సంఘాలు 99 శాతం లోన్లు తిరిగి చెల్లిస్తున్నారని గుర్తుచేశారు.పేదరికం మూలంగానే ఈ రాష్ట్రంలో నక్సలైట్లు వచ్చారు. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం వంటి మారుమూల ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల దోపిడీ భరించలేక ఎన్నో విప్ల ఉద్యమాలు పుట్టుకొచ్చాయన్నారు. అందుకే కొప్పుల రాజు వంటి ఐఏఎస్ లు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు అందజేశారన్నారు. వడ్డీ వ్యాపారుల దోపిడీపై అంకుశం గా మహిళా సంఘాలు పనిచేశాయన్నారు. మహిళా సంఘాలకు ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందన్నారు. మహిళా సంఘాలు ఏకంగా స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాయన్నారు. కోట్ల వ్యాపారాలను మహిళా సంఘాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. పెట్రోల్ బంకుల ఏర్పాటుతో ప్రారంభమైన మహిళా సంఘాల ప్రయాణం.. ఇప్పుడు సోలార్ ప్లాంట్ల, రైస్ మిల్లు లు, గోదాములు నిర్వహించే స్థాయికి ఎదిగాయని గుర్తుచేశారు. అదిలాబాదులో ఆదివాసి బిడ్డలు తయారుచేసిన ఇప్ప పువ్వు లడ్డూలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయన్నారు. ఇప్ప పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ములుగులో ఇప్ప చెట్లు పెంచుతున్నామన్నారు. హైటెక్ సిటీ లో గల ఇందిర మహిళా శక్తి బజార్ తరహాలో మరిన్ని బజార్లు హైదరాబాద్ నలుమూలలా ఏర్పాటు చేస్తామన్నాఉరు. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో పట్టం కడుతున్నామన్నారు. లోకల్ ప్రోడక్ట్లకు గ్లోబల్ ప్రాముఖ్యతను కల్పిస్తున్నామన్నారు. మన ఉత్పత్తులను మరింత ప్రోత్సహిస్తామన్నారు. మండల సమాఖ్యలు ఒంటరి మహిళలకు భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మహిళా సంఘాలు అడ్వాన్సులు ఇచ్చే స్థాయికి ఎదిగాయన్నారు. చేతిలో డబ్బులు లేని లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకోవడానికి మహిళా సంఘాలు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నాయి. లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలతో మహిళలు మహిళా సమాఖ్యలో ధైర్యంగా చేరుతున్నారన్నారు. స్వయం సహాయక సంఘాలతోనే మహిళలకు గుర్తింపు లభిస్తున్నదన్నారు.
నలుగురితో కలిసి నలుగురు సంక్షేమం కోసం పనిచేసేవే ఎస్‌హెచ్‌జీలు అన్నారు. సగటు స్త్రీ అస్తిత్వం స్వయం సహాయక బృందం. ఆడబిడ్డలం మేము…అందర్నీ ఆదరిస్తాం.. అణగదొక్కాలని చూస్తే ఆదిశక్తులమవుతామని హెచ్చరించారు.




