“రకరకాల స్వార్థం మీద, ప్రజల వనరులను, శ్రమలను అపహరించే వ్యవస్థీకృత దౌర్జన్యం మీద కత్తిదూసిన ఆశాదూతలు ఇప్పుడు ఒక నిర్మూలన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. వారు నిర్మించుకున్న ఆత్మరక్షణ దుర్గాలు, నిర్మించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలు అన్నీ, మోహరించిన రాజ్య శక్తి ధాటికి కుప్పకూలిపోతున్నాయి. సాహసత్యాగాల సాయుధత్వం కూడా నిస్పృహలోకి జారి, లొంగిపోతున్నది. నౌకతో పాటు మునిగిపోయే నిబద్ధ కేసెబియాంకలు ఉండవచ్చును, వారిని రేపటి చరిత్ర కొనియాడవచ్చును కానీ, సాధారణమైన దృష్టికి మాత్రం ఆశ్వాసాంతమే కనిపిస్తున్నది. కొనసాగింపు అసలే ఉండదనలేము. కొత్త ప్రారంభమూ కాదనలేము. ఇప్పటికి మాత్రం ఇది విషాదం.”

యుగాలు అవతరిస్తాయి, అంతరిస్తాయి. కాలం మాత్రం అనంత నిరంతరం. అధ్యాయాలూ ఆశ్వాసాలూ అయిపోతాయి, కానీ, మానవ ఇతి హాసానికి ముగింపు లేదు. ఇవి, ఆశావాద లాలసలో మాత్రమే చెప్పుకునే మాటలు కాదు, విరక్త ఆధ్యాత్మికతలో కూడా పునరపి పునరపి అనివార్యతలు, యుగేయుగే సంభావ్యతలు తారసపడతాయి. పరస్పరం సంఘర్షించుకునే శక్తులు ఒక్కొక్కదశలో ఒకటి పైచేయి అవుతాయి. పరాజితమైనవి కుంగిపోవచ్చును, లేదా, సుదీర్ఘ మౌనంలోకి అణగారిపోవచ్చును, పాతరూపం చెదిరిపోవచ్చును, కానీ, రెండో,మూడో, నాలుగో, వెయ్యో రాకడలు మాత్రం లేకుండా ఉండవు. చరిత్ర అనుభవాలే భవిష్యత్తును నిర్వచిస్తాయనుకుంటే, మానవ సంకల్పం, ప్రయత్నం ఎప్పుడూ పురోగామిగానే ఉంటుంది. అంచెలంచెలుగా అయినా, సారాంశంలో మంచే గెలుస్తుంటుంది.
రకరకాల స్వార్థం మీద, ప్రజల వనరులను, శ్రమలను అపహరించే వ్యవస్థీకృత దౌర్జన్యం మీద కత్తిదూసిన ఆశాదూతలు ఇప్పుడు ఒక నిర్మూలన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. వారు నిర్మించుకున్న ఆత్మరక్షణ దుర్గాలు, నిర్మించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలు అన్నీ, మోహరించిన రాజ్య శక్తి ధాటికి కుప్పకూలిపోతున్నాయి. సాహసత్యాగాల సాయుధత్వం కూడా నిస్పృహలోకి జారి, లొంగిపోతున్నది. నౌకతో పాటు మునిగిపోయే నిబద్ధ కేసెబియాంకలు ఉండవచ్చును, వారిని రేపటి చరిత్ర కొనియాడవచ్చును కానీ, సాధారణమైన దృష్టికి మాత్రం ఆశ్వాసాంతమే కనిపిస్తున్నది. కొనసాగింపు అసలే ఉండదనలేము. కొత్త ప్రారంభమూ కాదనలేము. ఇప్పటికి మాత్రం ఇది విషాదం.
ఒక పార్టీని, ఒక తరహా పోరాట పద్ధతిని ఈ సంహారకాండ, లొంగుబాటుపర్వాలు ఎంతగా దెబ్బతీస్తున్నాయి అనేది ప్రధానంగా ఆ సంస్థలకు, వాటి ప్రగాఢ అభిమానులకు సంబంధించింది కావచ్చును. కానీ, అర్థశతాబ్దానికి పైగా, విప్లవ శక్తులు సమాజంలో నిర్మించిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణం, ఒక న్యాయసమాజ నిర్మాణం జరుగుతోందన్న ఆశావహ స్ఫూర్తి చెదిరిపోవడం తెలుగుసమాజంలో తీవ్రమైన కలవరం కలిగిస్తున్నది. బహుశా, ఈ వేదన జాతీయస్థాయిలో కూడా ఏదో ఒక మేరకు వ్యక్తమవుతూనే ఉంటుంది. ఒక జీవశక్తి ఏదో జారిపోతున్న నిస్సహాయ వేదన సామాన్యులను కూడా వేధిస్తున్నది. మంచిచెడ్డలకు, తప్పొప్పులకు ప్రమాణంగా నిలిచిన ఒక నైతిక శక్తి బలహీనపడడం, శుష్కశూన్యాన్ని రచిస్తున్నట్టున్నది.
“విప్లవశక్తులే కాదు, సాధారణప్రగతి శీల శిబిరం, ఉదారవాదులు అందరూ ఒక నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సాధారణ ప్రజాజీవనం ద్వేషపూరితమై, తీవ్ర విభజనలలోకి కూరుకుపోతున్నది. సమస్య కేవలం దండకారణ్యమో, సాయుధ విప్లవదళాల మనుగడో మాత్రమే కాదు. ప్రస్తుత ‘నిర్మూలన’ తర్వాత గురి ‘అర్బన్ నక్సలైట్లే’ అని ప్రభుత్వాలు స్పష్టంగానే చెబుతున్నాయి. నక్సలైట్లతో చర్చల గురించి మాట్లాడినందుకు నిన్న కాంగ్రెస్‌పార్టీని తప్పుపట్టిన కేంద్రనాయకులు, ఇప్పుడు, నక్సలైట్లను రక్షించడానికి సిపిఐ, సిపిఎంలు ఎందుకు ప్రయత్నించాలని ప్రశ్నిస్తున్నారు. దేశంలో అన్నిప్రశ్నలనూ నిరోధించే వ్యవస్థను నిర్మించాలనుకునేవారికి, అధికారం వరుసగా సంక్రమిస్తున్నది. ఈ క్రమం ఇంకా కొనసాగేట్టే కనిపిస్తున్నది. “
ఈ ‘అంతిమ’ యుద్ధానికి కారకులెవరు? కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసం కంకణం కట్టుకున్న కేంద్రప్రభుత్వమా? మత-జాతీయవాద రాజ్యాన్నినిర్మించాలనుకుంటున్న కేంద్ర అధికారపార్టీయా? పోలీసు, అర్థసైనిక, సైనిక బలగాల కర్కశ అణచివేత పద్ధతులా; సామదానభేదోపాయాలతో లోలోపలికి జరిగిన చొరబాట్లా? లేక, ఈ మధ్య జరిగిన లొంగుబాట్ల వెల్లువా? పార్టీని నిలువునా చీల్చడానికి కుట్రతో, అభిప్రాయభేదాలను ముందుకు తెచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అగ్రనేతలా? ఇన్ని కారణాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఇవాళ తీవ్రమైన దాడి ఎదుర్కొంటున్న పార్టీ స్వయంకృతం పాలు కూడా ఇందులో లేదా అన్న ప్రశ్నకు కొంచెమైనా ఆస్కారం ఉండదా?
పదహారేళ్ల కిందట శ్రీలంక టైగర్ల పోరాటం విషాదాంతం అయింది. సామూహిక సంహారకాండతో సంస్థ, దాని పోరాటం అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. శ్రీలంక సైన్యం క్రూర అణచివేత, చైనా, భారత్, అమెరికా సహా అంతర్జాతీయ సమాజం మౌనాంగీకారం, తమిళపార్టీలతో పార్లమెంటరీ పక్షాల ప్రత్యక్ష పరోక్ష మద్దతు, అగ్రనాయకుడు కరుణ చీలిక, ఇవన్నీ ఎల్‌టిటిఇ పతనానికి కారణమయ్యాయి. అదే సమయంలో, ఆ సంస్థ, దాని నాయకుడు ప్రభాకరన్ అనుసరించిన దుందుడుకు, ఏకపక్ష వైఖరులు, విభేదించిన వారిమీద ప్రయోగించిన దారుణమైన హింస కూడా ఆ పరిణామానికి కారణాలు అని చెప్పకపోతే, చరిత్రకు, భవిష్యత్తుకు కూడా అపచారమే అవుతుంది.
సంక్షోభపరిస్థితులలో, చక్రవ్యూహంలో చిక్కుబడిన స్థితిలో, విప్లవ ఉద్యమం ప్రయాణం గురించిన ప్రశ్నలు వేయడం సమంజసం కాదనిపించవచ్చు. మునుపెన్నడూ మాట్లాడకుండా, హెచ్చరికలు చేయకుండా, ఇప్పుడు మాత్రమే మాట్లాడితే నిజంగానే అది చిత్తశుద్ధి లేని పని కావచ్చు. ఆ సమయంలో దిద్దుబాటుకు కూడా అవకాశమే ఉండకపోవచ్చు. కానీ, ఇవాళ మావోయిస్టులు, వారి ఆచరణ ప్రాంతాలలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న పరిస్థితికి పదేళ్ల కిందటి నుంచే సూచనలు కనిపించాయి. ఆదివాసులు, మానవహక్కులు వంటి రంగాలలో పనిచేసే జాతీయస్థాయి పౌరసమాజాన్ని మౌనంలోకి పంపడానికి బీమాకోరేగావ్ కేసు రూపొందినప్పుడే, పరిస్థితిని గ్రహించి ఉండాలి. హక్కుల ఉల్లంఘనలను, నిర్బంధాలను ఖండించే పౌరసమాజమే, మావోయిస్టుల ఆచరణల సమీక్ష గురించి కూడా అప్పుడప్పుడైనా సూచనలు చేస్తూ వచ్చింది. అంతర్గతంగా కూడా ఆ చర్చ బహుశా జరుగుతూనే ఉండి ఉండాలి.
ప్రశ్న, సమీక్ష కోసం సూచన- శత్రుపూరితంగా పరిగణించనక్కరలేదు. ప్రశ్న దానంతట అదే ద్రోహం కాదు. ద్రోహం చేయదలచుకున్నవారు అందుకు వీలుగా ప్రశ్నించడం మొదలుపెట్టారనుకున్నా, ఆ ప్రశ్న అర్థరహితం అయిపోదు. ఏ కారణం చేత అయినా సరే, ప్రశ్నను , విద్రోహాన్ని పక్క పక్కన పెట్టి, మాట్లాడడం, ప్రజాస్వామిక విమర్శ సంప్రదాయాన్ని దెబ్బతీయడమే. విమర్శకులను ఒత్తిడిలో పెట్టడమే. మావోయిస్టు పార్టీలో ఏమి జరిగిందో, బయటి సమాజానికి తెలియదు. చీలిక జరిగిందా, చీలిక బయటి ప్రమేయంతో జరిగిందా, చీలిక మాత్రమేనా, అంతకు మించిన విద్రోహం జరిగిందా, అన్న సందేహాలు సామాజికమాధ్యమాలలో సంచరిస్తున్నాయి.
విప్లవపార్టీలకు చెందిన సైద్ధాంతిక, సంస్థాగత అంశాలు సామాజిక మాధ్యమాలలో ఇంత ఉధృతంగా చర్చలో ఉండడం ఇదే మొదలు. ఈ పరిణామాల గురించి తెలుగుప్రాంతాల సాధారణ విప్లవాభిమాన ప్రజలు, కారుణ్య మానవీయ కోణంలో మాత్రమే ఆలోచిస్తారు. పార్టీలో అంతర్గతంగా జరిగే పోరాటం, విభిన్నవర్గాల మధ్య ఆరోపణలు వారు పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. ఈ పరిస్థితి తప్పిపోతే బాగుండును, చర్చలు జరిగి తాత్కాలిక ప్రశాంతి ఏర్పడితే బాగుండును, విప్లవకారులకు హాని జరగకపోతే బాగుండును అని అనుకుంటారు. దండకారణ్యం ఇక ఎంత మాత్రం దుర్గమారణ్యం కాదని, తాము ఎంతో ఆరాధనతో ఉండే విప్లవదళాలు ప్రమాదంలో ఉన్నారని తెలిసినప్పుడు, లొంగిపోయి అయినా, ఇప్పటి గండాన్ని తప్పించుకోవడాన్ని అటువంటి కారుణ్యవాదులు సానుకూలంగానే చూస్తారు. ఇంతకాలం వారు చేసిన త్యాగాన్నిపరిగణనలోకి తీసుకుని, వారిని నిందించడాన్ని తప్పుపడతారు. చావు అనివార్యమయ్యేపరిస్థితులలో లొంగిపోయిన వారి విషయంలో నిందలు, దూషణలు పనికిరావని భావిస్తారు. ఏది ఏమయినా, ఈ అంశాల గురించిన సంవాదం, సభ్యత సంస్కారాల పరిధిలో జరగడం లేదని అనిపిస్తున్నది. మరోవైపు, ఈ మొత్తం గందరగోళంలో మౌలిక ప్రశ్నలు అప్రధానం అవుతున్నాయి.
విప్లవశక్తులే కాదు, సాధారణప్రగతి శీల శిబిరం, ఉదారవాదులు అందరూ ఒక నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సాధారణ ప్రజాజీవనం ద్వేషపూరితమై, తీవ్ర విభజనలలోకి కూరుకుపోతున్నది. సమస్య కేవలం దండకారణ్యమో, సాయుధ విప్లవదళాల మనుగడో మాత్రమే కాదు. ప్రస్తుత ‘నిర్మూలన’ తర్వాత గురి ‘అర్బన్ నక్సలైట్లే’ అని ప్రభుత్వాలు స్పష్టంగానే చెబుతున్నాయి. నక్సలైట్లతో చర్చల గురించి మాట్లాడినందుకు నిన్న కాంగ్రెస్‌పార్టీని తప్పుపట్టిన కేంద్రనాయకులు, ఇప్పుడు, నక్సలైట్లను రక్షించడానికి సిపిఐ, సిపిఎంలు ఎందుకు ప్రయత్నించాలని ప్రశ్నిస్తున్నారు. దేశంలో అన్నిప్రశ్నలనూ నిరోధించే వ్యవస్థను నిర్మించాలనుకునేవారికి, అధికారం వరుసగా సంక్రమిస్తున్నది. ఈ క్రమం ఇంకా కొనసాగేట్టే కనిపిస్తున్నది.
ఈ స్థితిలో విశాలమైన ఐక్యకార్యాచరణను రూపొందించుకుని, దేశానికి ఒక ప్రత్యామ్నాయాన్ని అందించవలసిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? చర్చను, ప్రశ్నలను మరింత విస్తృతమైన పరిధిలోకి, మరింత లోతైన కర్తవ్యాలలోకి ఎవరు నడిపిస్తారు? ప్రజల పేరుతో వ్యవహరించే ప్రత్యమ్నాయ ఆచరణ వాదులు, ఎంత వరకు ప్రజల అభిప్రాయాలను, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటారు? ప్రజలే అంతిమ విజేతలు అన్నది ఒక యాంత్రిక సూత్రం మాత్రమే అయితే, ప్రస్తుత అపజయాలనుంచి గట్టెక్కగలిగే చొరవ ఎక్కడి నుంచి వస్తుంది?.




