మెరుపు తీగెలు

 “చంపేశారు!”

          “ఎలా?”

          “కొట్టి చంపేశారు!”

          “మనుషులేనా?”

          “మనుషులే మనుషుల్ని కొట్టి చంపేశారు!”

          “తప్పుకదా?”

          “కాదనే అంటున్నారు!”

          “ఎందుకు?”

          “అతను అన్యమతస్తుడు!”

          “కాదు, అతను మన హిందువేనట కదా?”

          “కావచ్చు, కాని అతను మతం మారాడు మరి!”

          “పాపం!”

          “ఊ… పాపమే చేశాడు…”

          “పాపమే యెందుకు చేశాడు?”

          “కష్టాలు తీరుతాయని మతం మారాడు!”

          “కాని కొత్త కష్టాలు వచ్చాయిగా?”

          “అది అర్థం చేసుకొనే పిల్లలు తిరిగి మతం మారారు!”

          “అంటే…?”

          “వాపస్ వచ్చేశారు!”

          “ఎక్కడున్నా కష్టాలు తప్పవని అర్థం చేసుకున్నట్టున్నారు…”

          “దేవుడే కష్టాలు పెడతాడు!”

          “అదేమిటి?”

          “పరీక్షిస్తాడన్నమాట!”

          “అలా అయితే దేవుడిదే కదా తప్పు?”

          “కాదు, మతం మారడమే పెద్ద తప్పు!”

          “మరొక దేవుణ్ణి నమ్మడం తప్పెలా అవుతుంది?”

          “మన దేవుళ్ళని వదిలి వేరే దేవుణ్ణి నమ్మడం అంటే అది అవమానించినట్టు అవుతుంది!”

          “ఇప్పుడు మనకు యెందరో దేవుళ్ళు వున్నారు, వొకరు రాముణ్ణి మరొకరు కృష్ణుణ్ణి యింకొకరు శివుణ్ణి యింకొకరు వెంకటేశ్వరస్వామిని… నచ్చిన దేవుణ్ణి యెంచుకోవచ్చు కదా?”

          “ఊ… యెవరైనా వొకటే!”

          “అల్లా జీసస్సూ దేవుళ్ళే కదా?”

          “కాని మన మతం కాదు కదా?”

          “దేవుడు ముఖ్యమా? మతం ముఖ్యమా?”

          “మతమే ముఖ్యం!”

          “అదేంటి?”

          “ఔను, మతం లేకుండా దేవుడు లేడు. మతం నాశనం అయితే దేవుడు నాశనం అయిపోతాడు. అంచేత…”

          “అర్థమైంది!”

          “ఏమర్థమైంది?”

          “మనుషులు దేవుడ్ని కాపాడడానికి మనుషుల్ని చంపుతారని!”

          సర్వవ్యాప్తమైన దేవుడు ఆ సమయాన అక్కడా వుండి ఆ సంబాషణ విని, “నేను యెప్పుడో చచ్చిపోయాను కదరా?” అన్నాడు.

          ఆ మాట విని “యెవడో పిచ్చోడు” అని యెగాదిగా చూశాడు మనిషి… కాదు మతస్థుఁడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *