దేశ రాజకీయాల్లో ఇప్పుడు నిస్తేజం ఆవరించింది. బిజెపిని ఢీకొనేందుకు ఏర్పడ్డ ఇండియా కూటమి షెడ్డుకు చేరింది. కూటమిగా పనిచేసేందుకు అందులోని పార్టీలు ముందుకు రావడం లేదు. ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా పార్టీల వ్యవహారం సాగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నిర్మానాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం కుదరడం లేదు. టిఎంసి, డిఎంకె పార్టీలు పార్లమెంటులో సొంత ఎజెండాతో పోతున్నాయి. వాటికి అవసరమైన మేరకు ఆందోళన చేస్తున్నాయి. డిఎంకె జాతీయ విద్యావిధానం, హిందీ వ్యతిరేకతపైనే రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అవతకవలు, వోటరల జాబితాపై పోరాడుతోంది. మొత్తంగా అన్ని పార్టీల్లోనూ సొంత ఎజెండాలే తప్ప ప్రజల ఎజెండా కానరావడం లేదు. పార్లమెంటులో ప్రజల పక్షాన నిలిచామని చెప్పుకోవడానికి ఈ పార్టీలు పనిచేయలేక పోతున్నాయి. రెండోదఫా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాలపై నిలదీసే కార్యక్రమంకానరావడం లేదు. నాయకుడిగా రాహుల్ ఇంకా పరిణతి చెందలేదు. పార్టీ పెత్తనాన్ని అట్టిపెట్టుకోవడం మినహా దేశాన్ని నడిపించే సత్తా ఉందని నిరూపించుకోలేక పోతున్నారు. రాహుల్‌తో పోలిస్తే ప్రియాంక కొంత చురుకుగా ఉంటున్నారు. ఇకపోతే దిల్లీ ఎన్నికల ఫలితాల తరవాత ఆప్ ఓటమితో.. ప్రత్యామ్నాయ రాజకీయాలకు గండిపడింది.
ఆప్ అవినీతి కారణంగా ప్రజలు ఇతర పార్టీలను నమ్మే విధంగా లేరు. దీంతో బిజెపికి తీరుగులదేన్న విధంగా పరిస్థితి మారుతోంది. డబుల్ ఇంజన్ అంటూ మోదీ చేసిన ప్రచారం బాగా పనిచేసిందనే చెప్పాలి. అలాగే మోదీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి మరింత బలం చేకూరింది. మోదీ నాయకత్వానికి తిరుగులేదని నిరూపితం అయ్యింది. బిజెపియే దేశానికి రక్ష అన్న వాదనకు కూడా బలం చేకూరింది. ఇదే సందర్భంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటూ బయలుదేరిన పార్టీలకు ఈ ఫలితాలు ఎదురుదెబ్బగానే భావించాలి. ప్రత్యమ్నాయ రాజకీయాలకు పెద్దగా అనుకూలం కాదని తేలింది. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలను ప్రజలు ఆమోదించడం లేదని వరుస పరిణామాలు రుజువు చేశాయి. అలాగే కాంగ్రెస్ నాయకత్వం మారాల్సిన అవసరాన్ని గుర్తించాలి.
రాహుల్, ప్రియాంకలు కాంగ్రెస్ నావను గట్టెక్కిం చలేరని కూడా తేలిపో యింది. మోదీ ఛరిష్మా తగ్గలేదని కూడా దిల్లీ ఫలితాలు మరోమారు రుజువు చేస్తున్నాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటూ మోదీ చేసిన ప్రచారం ప్రజలను ఆలోచింపచేసిందనే చెప్పాలి. ఇకపోతే సంప్రదాయ వోటు అన్నదానికి అర్థం లేకుండా పోతోంది. వోటర్లు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఫలానా పార్టీకే అంటిపెట్టుకుని వోటర్లు ఉండడం లేదు. మోదీకి ప్రత్యామ్నాయ నేతగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆవిర్భవించినట్లు ప్రచారం జరిగినా.. అవినీతి మరకలు అతడిని అథఃపాతాళానికి తొక్కేశాయి. దిల్లీలో రెండుసార్లు అధికారం నిలుపుకోవడంతో పాటు పంజాబ్‌లో అధికారం చేపట్టడంతో తనకు తిరులేదని భావించారు.
ప్రధాని పదవిపై కన్నేసి అడ్డమైన గడ్డి తిన్నారు. మోదీకి తానే ప్రత్యామ్నాయం అనుకుని కేజ్రీవాల్ విర్రవీగారు. ఈ క్రమంలో నీచరాజకీయాలకు లోనయ్యారు. ఇక యూపిని తీసుకుంటే యోగి పాలనా దక్షతకు తోడు మోదీ డబుల్ ఇంజిన్ ప్రచారం బాగా పనిచేసింది. యూపిలో వరుసగా రెండోసారి అధికారం నిలుపుకోవడం కూడా బిజెపికి ఓ చరిత్రగా చూడాలి. యూపి ఫలితాలను విశ్లేషించుకుంటే ఎస్పీ బలం పుంజుకుంది. తొలిసారి వంద సీట్లను దాటింది. ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. బిఎస్పీతో పాటు కాంగ్రెస్ కూడా యూపిలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ రాహుల్,ప్రియాంకల ప్రచారం ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఇందిరతో ప్రియాంకను పోలుస్తూ ఇటీవల దేశంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. బిజెపి పట్ల ప్రజలు ఇంకా విశ్వాసంతోనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం అవినీతి రహిత పాలన కూడా బాగా పనిచేసిందనే చెప్పాలి. దేశ ప్రయోజనాలను కూడా ప్రజలు ఆశిస్తున్నారు. ఆలాగే ప్రత్యామ్నాయ రాజకీయాలకు అడుగు పడుతుందా అన్నది కూడా ఇప్పుడు అనుమానంగా మారింది. కాంగ్రెస్ తాను గిరిగీసుకున్న చట్రం నుంచి బయటపడాలి. తనను తాను సంస్కరించుకోవాలి. ప్రజా పోరాటాలతో రాటుదేలాలి. కేవలం ఒక్కటంటే ఒక్క పాదయాత్ర చేసి ఇక అంతా అయ్యిందన్న ధీమాలో రాహుల్ ఉన్నారు. అలా అనుకుంటే పొరపాటు.
ప్రజలు కాంగ్రెస్‌కే ఎందుకు వోటేయాలన్న ఆలోచన కలిగించగలగాలి. గతంలో తెలంగాణ సిఎంగా ఉన్న సమయంలో కెసిఆర్ కూడా గుణాత్మక రాజకీయాలు అంటూ బయలు దేరారు. ఆయనకు మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్ లాంటి నేతలు మద్దతు పలికారు. పికె లాంటి వారు వ్యూహాలు పన్నారు. ఫలితాలు బిజెపికి వ్యతిరేకంగా వొస్తాయిన అంతా ఆశించారు. కానీ ఇప్పుడు కెసిఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితం అయ్యారు. తెలంగాణలో అధికారం కోల్పోవడంతో ఆయన చురుకైన పాత్ర పోషించడం లేదు. మోదీని నిలువ రించేందుకు ప్రతిపక్షాలను ఐక్యం చేయాలన్న సంకల్పంలో ఇప్పుడు రాజకీయంగా శూన్యం ఏర్పడిందనే చెప్పాలి. ఎందుకంటే మోదీ వ్యూహాల ముందు అంతా దిగదుడుపే అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలను కుటుంబం నుంచి తప్పిస్తే తప్ప దానిని ముందుకు తీసుకుని వెళ్లడం సాధ్యం కాదు. ఆయా రాష్ట్రాల్లో బిజెపి అధికారం నిలబెట్టు కోవడమన్నది బిజెపికి కలసివొచ్చే అంశగా చూడాలి. అలాగే మోదీ, అమిత్ షాల ఉమ్మడి నాయకత్వం పట్ల ప్రజల విశ్వాసం చెదరలేదని, వారికి తిరుగులేదని కూడా చెప్పుకోవొచ్చు. ఇదే సందర్భంలో ప్రాంతీయ పార్టీలకు ప్రత్యమ్నాయం కూడా అంత సులభం కాదని కూడా గుర్తించాలి.
– ప్రజాతంత్ర డెస్క్.





