మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి

ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి
వామక్షాల సదస్సులో వక్తలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి, ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్  వెంటనే నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ బషీర్ దేశోద్ధారక భవన్ లో రాష్ట్ర సదస్సు  జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ రాష్ట్ర సదస్సులో  సిపిఐ ఎంఎల్సి నెల్లికంటి సత్యం, బి.చంద్ర కుమార్, సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  కె.జి.రాంచందర్, ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సిపిఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి ఎ.జానకిరాములు, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి  రాజా రమేష్ , ఎస్ (కమ్యూనిస్టు) రాష్ట్ర కార్యదర్శి  సిహెచ్. మురహరి, పార్వర్డ్ బ్లాక్ నాయకులు ప్రసాద్, సిపిఐ  న్యూడెమోక్రసీ నాయకులు విశ్వనాథ్, అరుణోదయ నాయకురాలు విమలక్క ప్రసంగించారు.

కగార్ ఆపరేషన్ పేరుతో  రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మానవ సంహారాన్ని తక్షణమే నిలిపివేసి  మావోయిస్టులతో  బేషరతుగా చర్చలు జరపాలని డిమాండ్  చేశారు. మావోయిస్టులు  శాంతి చర్చలు ప్రతిపాదించిన తర్వాత వారు ఒక్క దాడికి పాల్పడిన ఘటన కూడా లేదన్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన  కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారిని శాంతి చర్చలకు పిలవాల్సిందిపోయి అందుకు విరుద్దంగా 25 వేల మంది కేంద్ర సాయుధ బలగాలతో కర్రెగుట్టలను అష్ట దిగ్భందనం చేసి ఆదివాసీల హనననానికి వ్యూహా రచనలు చేయడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనుషులను  చంపే హక్కు ఎవరిచ్చారు?
కూనంనేని సాంబశివరావు
ఈ దేశ పౌరులైన మావోయిస్టులను తేదీ, సమయం నిర్ధేశించి మరీ సంహరిస్తామని ప్రకటించే హక్కు  కేంద్ర హోంమంత్రి అమిత్ ఎవరిచ్చారని  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.  ప్రజలు ఎవరైనా తప్పు చేస్తే వారిని రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన చట్టాల ప్రకారం  శిక్షించాలే తప్ప  కాల్చి చంపే అధికారం ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. గతంలో  రాజీవ్ అత్యంత దారుణంగా చంపిన వారికే  క్షేమాభిక్ష పెట్టాలని ఆయన  కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె  ప్రియాంక గాంధీ మానత్వంతో కోరారని సాంబశివరావు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అత్యంత దుర్మార్గంగా మావోయిస్టులను చంపుతోందని, అసలు వారి ఎజెండా ప్రశ్నించే వారిని చంపడమేనా అని ప్రశ్నించారు. ఈ దేశ ప్రజల హితం కోరే కమ్యూనిస్టుల ప్రతి ప్రకటన కోట్లాది మంది ప్రజలను కదిలిస్తుందని,  ఆలోచింపజేస్తుందని, అందుకే ఈ భావాజాలమంటే పాలకులకు భయమని ఆయన పేర్కొన్నారు.

మన దేశం శాంతి, సామరస్యాన్ని కోరుకునే దేశమని, అందుకు అనుగుణంగా  వచ్చిన రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యం ఏర్పడిందన్నారు. ఇతర దేశాలతో యుద్దం జరిగే క్రమంలో కూడా యుద్దనీతి అనేది ఒకటి ఉంటుందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఈ దేశ పౌరులపైనే యుద్దం ప్రకటించి వారిని  అత్యంత దారుణంగా వేటాడి వెంటాడి కాల్చి చంపే హక్కు వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనలను  న్యాయస్థానాలు సుమోటాగా స్వీకరించి న్యాయ విచారణ  చేపట్టాలని కోరారు. బిజెపి పాలకులు తామే శాశ్వతమని అనుకుంటున్నారని, ఆయితే ప్రజాస్వామ్యంలో  ప్రజలు, చట్టాలు మాత్రమే శాశ్వతమని, అవే  శక్తివంతమని  ఈ ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. మావోయిస్టులు అనుసరిస్తున్న రాజకీయ పంథాకు ఇది సరైన సమయం గాని, ప్రస్తుతం దేశంలో ఆలాంటి పరిస్థితులు లేవని, దీనిని వారు కూడా ఆలోచించాలని  కోరారు. అసలు ఎర్రజెండాలన్నీ కలిసి ఒకే జెండా ఏర్పడితే  ఆనాటి రాజ్యం మనదేనని, మనమంతా  కోరుకుంటున్న సమసమాజం ఏర్పడుతుందని సాంబశివరావు అన్నారు.

 ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విశాల వేదిక : ఎమ్మెల్సీ సత్యం
ప్రజాస్వామిక దేశంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వామపక్షాలు ఏకతాటిపైకి రావడం చారిత్రక ఘట్టమని  సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.  మావోయిస్టుల రాజకీయ పంథాపై అన్ని పార్టీలకు విభిన్నాభిప్రాయాలు ఉండోచ్చని,  కానీ రాజ్యాంగంపై  ప్రమాణం చేసిన  హోంమంత్రే  మావోయిస్టులను  ఏరివేస్తామని  ఆప్రజాస్వామికంగా కగార్ ఆపరేషన్ కొనసాగించడం గర్హనీయమన్నారు.  దేశంలో అనేక  సందర్భాలలో శాంతి చర్చలు జరిగాయని,  ఇతర దేశాలలో వేర్పాటు  ఉద్యమం సమయంలోనూ చర్చలు జరిగాయి, కానీ దేశంలో మావోయిస్టులనే కాకుండా ప్రజాస్వామికవాదులను, నక్సలైట్ల పేరుతో ఆదివాసీలను  పూర్తిగా నిర్మూలించేందుకు  నిరంకుశ బిజెపి ప్రభుత్వం పెద్దఎత్తున  దమన కాండను కొనసాగిస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్కౌంటర్ పేరుతో  ఒక్కసారిగా  పదుల సంఖ్యలో మావోయిస్టులను చంపేయడం, వారి చుట్టూ  పోలీసులు నృత్యాలు చేయడం చూస్తుంటే ఇది ప్రజాస్వామిక దేశామేనా అనే ఆవేదన కలుగుతోందన్నారు.  ఇలాంటి  ఘటనలను ఖండిస్తూ వామపక్షాలే  కాకుండా కలిసివొచ్చే అన్ని శక్తులతో విశాల వేదిక ఏర్పాటు చేసుకుని  కేంద్ర ప్రభుత్వ విధానాలపై  అవిశ్రాంత ఉద్యమం కొనసాగించాలని సత్యం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *