టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టండి

– ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అపార అవకాశాలు
– తైవాన్‌ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి రైజింగ్‌ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని తైవాన్‌ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. తైవాన్‌ టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌(టీటీఎఫ్‌) అధ్యక్షుడు జస్టిన్‌ వాంగ్‌ నాయకత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం మంత్రిని సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసింది. స్వల్ప కాలంలోనే టెక్స్‌టైల్‌ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దీటుగా ఎదిగిందని, దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి ఇక్కడే పండుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌(కేఎంటీపీ) గేమ్‌ ఛేంజర్‌గా మారిందని, ప్రపంచ పటంలో తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తోంది అని మంత్రి వివరించారు. కేఎంటీపీలో జిన్నింగ్‌, స్పిన్నింగ్‌, వీవింగ్‌, ప్రాసెసింగ్‌, గార్మెంటింగ్‌ అన్నీ ఒకేచోట పూర్తిచేసేలా అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామన్నారు. టెక్స్‌టైల్‌ దిగ్గజ కంపెనీలు యంగాన్‌, కైటెక్స్‌, గణేషా ఎకోస్పియర్‌ ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయని, రవాణా సౌకర్యాలపరంగా కూడా అనుకూలంగా ఉంటుందని, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌-విజయవాడ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు అనుసంధానంగా ఉంటుందని వెల్లడిరచారు. ఫంక్షనల్‌ టెక్స్‌టైల్స్‌, ఎకో-డైయింగ్‌, టెక్స్‌టైల్‌ రీసైక్లింగ్‌ తదితర అంశాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని చెప్పారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. కస్టమైజ్డ్‌ ల్యాండ్‌ పార్సిల్స్‌, ప్లగ్‌ అండ్‌ ప్లే యూనిట్స్‌, నైపుణ్య మానవ వనరులు, సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం, భౌగోళిక పరిస్థితులు పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్నాయని తెలిపారు. టెక్స్‌టైల్స్‌, టెక్నికల్‌ టైక్స్‌టైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ సిస్టం డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌(ఈఎస్‌డీఎం), సస్టైనబుల్‌ మాన్యుఫాక్చరింగ్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ఆర్‌అండ్‌డీ తదితర రంగాల్లో తైవాన్‌ కంపెనీలకు తెలంగాణ అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. తైవాన్‌ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే ‘తెలంగాణ-తైవాన్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌, ప్రత్యేక టైక్స్‌టైల్‌ క్లస్టర్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి టీటీఎఫ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి, రాష్ట్ర టైక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ ధరణి, టీటీఎఫ్‌ సెక్షన్‌ చీఫ్‌ ఆర్థర్‌ చియాంగ్‌, తైవాన్‌కు చెందిన టైనాన్‌ ఎంటం ప్రైజ్‌ కంపెనీ లిమిటెడ్‌, లీలీ గ్రూప్‌, ఆల్కేమీ తైవాన్‌ లిమిటెట్‌, సింగ్‌ యోంగ్‌ హో ఎంటర్‌ ప్రైజ్‌ కంపెనీ లిమిటెడ్‌, ఫార్‌ ఈస్టర్న్‌ న్యూ సెంచరీ కార్పొరేషన్‌, లిటిల్‌ కింగ్‌ గ్లోబల్‌ కంపెనీ లిమిటెడ్‌, యూ బంగ్‌ ఎంటర్‌ప్రైజ్‌ కంపెనీ లిమిటెడ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *