– కాంగ్రెస్‌కు ఎ.టి.ఎం.గా మారిన తెలంగాణ
– అవినీతి బాగోతం బట్టబయలు
– కె.టి.ఆర్. ఆరోపణ
తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ రెడ్డి పేరును ఈడి తన చార్జ్ షీట్ లో నమోదు చేయడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు చేర్చడంతో సీఎం అవినీతి బాగోతం అందరికీ తెలిసిందన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారిందన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే తన అవినీతిని చర్చించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఈడి చార్జిషీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత అయినా కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా? అని ప్రశ్నించారు. అమృత్ స్కాం, ఆర్ఆర్ టాక్స్ స్కాం, సివిల్ సప్లై స్కాం వంటి వాటిలో ఇంతకుముందు వదిలేసినట్లుగా వదిలేస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందన్నారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ? అని ప్రశ్నించారు. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోందన్నారు.





