బ‌న‌క‌చ‌ర్ల టెండర్లు నిలిపివేయాలి

– పి.ఎఫ్‌.ఆర్‌.ను తిర‌స్క‌రించాలి
– కేంద్రానికి మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి విజ్ఞ‌ప్తి
– ఇది అంత‌ర్ రాష్ట్ర జ‌లాల నియ‌మాల‌ను ఉల్లంఘించ‌డ‌మే
– ఏపీ వైఖ‌రి ఆక్షేప‌ణీయం
– ఏ అనుమ‌తులూ లేకుండా ఎట్లా అమ‌లుచేస్తారు?

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14: తెలంగాణ నీటి పారుదల, ఆహార మరియు పౌర సరఫరా శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి–బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్ ఆర్‌)ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే తిరస్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్‌)ను సమర్పించకుండా నిరోధించాలి, అలాగే టెండర్లు పిలవడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.  జూన్ 13న కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ కు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఘాటుగా లేఖ‌రాశారు. దీని ప్ర‌కారం  ఈ ప్రాజెక్టు 1980  గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ (జీడ‌బ్ల్యుటీ) తీర్పు, 2014  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (ఏపీఆర్ ఏ) లను పూర్తిగా ఉల్లంఘిస్తున్నదని, ఇది తెలంగాణ హక్కైన నీటి వాటాను అన్యాయంగా దోచుకునే కుట్రగా నిలుస్తుందని హెచ్చరించారు.

ఏపీ వైఖ‌రికి ఖండ‌న‌
2025, జూన్ 2న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ ఆధ్వర్యంలో, జల్ శక్తి మంత్రిత్వ శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ అమిత్ కుమార్ ఝా హాజరైనప్పటికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డీపీఆర్ సమర్పించమని కోరడం  దానివల్ల పీఎఫ్ఆర్ ఇప్పటికే ఆమోదించిన‌ట్ట‌వుతోందంటూ ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సీడ‌బ్ల్యుసి (కేంద్ర జ‌ల‌సంఘం) మొదట పీఫ్ఆర్‌ను ఆమోదించిన తర్వాతే ఏ రాష్ట్రమైనా డీపీఆర్‌ సమర్పించగలదని నిబంధన ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పరోక్ష ఆమోదం ఇస్తున్నట్లు కనబడుతుందని ఆయన అన్నారు. “ఇది అంతర్రాష్ట్ర జలాల పాలన నియమాలను ధ్వంసం చేయడమే” న‌ని విమ‌ర్శించారు.

గతంలోనూ అప్రమత్తత
2025, జనవరి 22న, ఉత్తమ్ కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  లకు లేఖలు రాసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ 2024 నవంబర్ 15, డిసెంబర్ 31 తేదీల్లో కేంద్రానికి లేఖలు పంపి ఈ ప్రాజెక్టుకు మద్దతు కోరారు. డిసెంబర్ 29న ఇచ్చిన ప్రెజెంటేషన్ ప్రకారం, గోదావరి నుంచి 200 టీఎంసీ నీటిని గుంటూరు జిల్లా బొల్లపల్లిలో 150 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌కు మళ్లించేందుకు ప్రణాళిక ర‌చించారు. మొత్తం రూ.80,112 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును మూడు భాగాలుగా విభజించారు మొద‌టి భాగం  గోదావరి నుంచి కృష్ణ నది వరకు – రూ.13,511 కోట్లు, రెండ‌వ భాగం కృష్ణ నుంచి బొల్లపల్లి వరకు రూ.28,560 కోట్లు, మూడో భాగం బొల్లపల్లి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు  రూ.38,041 కోట్లు.

మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి లేవ‌నెత్తిన అభ్యంత‌రాలీవిధంగా వున్నాయి.  మొద‌టిది ఏపీ ప్రాజెక్ట్‌కు సీడ‌బ్ల్యుసి ఆమోదం లేదు. రెండ‌వ‌ది జీఆర్ ఎంబీ, కెఆర్ ఎంబీల నుంచి అనుమతులు తీసుకోలేదు మూడ‌వ‌ది ఎపెక్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. జీడ‌బ్ల్యుడీటీ ప్ర‌కారం  1,486 టీఎంసీ నీరు అప్పట్లో ఏకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించ‌గా అందులో 968 టీఎంసీ ఇప్పటి తెలంగాణకు చెందుతుందని ఉత్తమ్ గుర్తు చేశారు. తెలంగాణకు కేటాయించిన వాటా ప్రాజెక్టులే ఇంకా క్లియరెన్సులకు ఎదురుచూస్తుండగా, ఆంధ్ర ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *