“గోదావరి, కృష్ణా జలాల వాటా కోసం ఆంధ్రప్రదేశ్ తో పంచాయతీ పుష్కరకాలమైనా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ పబ్బం గడుపుకుంటున్నది. ఏపీ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలించుకు పోతున్నా… అడ్డుకునే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం లేదు. బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్ పేరు తెచ్చి… పనులు చేస్తున్నా అడ్డుకోవాల్సిన రీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించడం లేదు. 8 నెలలైనా టెలీమెట్రిలను ఏర్పాటు చేయించేలా కేంద్రంపై ఒత్తిడి చేయలేని దయనీయ స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉండడం ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆనాడే కేసీఆర్ పూర్తి చేసి ఉంటే… మనకు రావాల్సిన నీళ్ల వాటా మనకు వచ్చి ఉండేది. ఏపీ సర్కార్ నల్లమల సాగర్ పూర్తి చేస్తే… తెలంగాణకు నీళ్ల వాటా తగ్గడం మాత్రం ఖాయం.”

సీనియర్ జర్నలిస్ట్
తెలంగాణ వాదం పలుచన చేస్తూనే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు ఉధృతంగా సాగుతున్నాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దగాపడింది ఉద్యమకారులే. అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. వీరిద్దరూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యారు. మనుగడ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ ఏర్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులయ్యారు. ఏ ఆదాయం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి త్యజించారో… తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత కూడా అవే సమస్యలు, అవే అవమానాలు,, అదే దోపిడీ విధానాలు, వివక్ష కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిణామాలు సమైక్యవాదులకు సంతోషం కలిగిస్తున్నది. కడుపుచించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న చందంగా తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పడుతున్న వేదన, బాధ మాటల్లో వర్ణించలేనిది.
గోదావరి, కృష్ణా జలాల వాటా కోసం ఆంధ్రప్రదేశ్ తో పంచాయతీ పుష్కరకాలమైనా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ పబ్బం గడుపుకుంటున్నది. ఏపీ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలించుకు పోతున్నా… అడ్డుకునే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం లేదు. బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్ పేరు తెచ్చి… పనులు చేస్తున్నా అడ్డుకోవాల్సిన రీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించడం లేదు. 8 నెలలైనా టెలీమెట్రిలను ఏర్పాటు చేయించేలా కేంద్రంపై ఒత్తిడి చేయలేని దయనీయ స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉండడం ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆనాడే కేసీఆర్ పూర్తి చేసి ఉంటే… మనకు రావాల్సిన నీళ్ల వాటా మనకు వచ్చి ఉండేది. ఏపీ సర్కార్ నల్లమల సాగర్ పూర్తి చేస్తే… తెలంగాణకు నీళ్ల వాటా తగ్గడం మాత్రం ఖాయం.
ఇక గోదావరి నీళ్లు వాడుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్.. మొత్తం పనులను చేయలేదు. పైగా మేడిగడ్డ బరాజు లో 3 పిల్లర్లు కుంగడం, పగుళ్లు వారడం వల్ల ఆ బరాజు ప్రమాదంలో పడిపోయింది. చిన్న పాటి రిపేర్ల తో బ్యారేజ్ ఉపయోగంలోకి వస్తుందని బిఆర్ఎస్ చెప్పినా రేవంత్ రెడ్డి సర్కారు పట్టించుకోలేదు. ఫ్రీగా మరమ్మతులు చేస్తామన్న నిర్మాణ సంస్థ మాటలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు. ఎంతసేపూ కాళేశ్వరం కూలిపోయిందని కేసిఆర్ పైన విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందింది. ఈ అంశాన్ని సాగదీస్తూ … కేసిఆర్ హవాను తగ్గించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. కుంగిన పిల్లర్ల రిపేర్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఉచితంగా మరమ్మతు చేసి పెడతామన్న నిర్మాణ సంస్థను కాదని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్తగా టెండర్లు పిలవడం డబ్బుల కోసమేనని బిఆర్ఎస్ విమర్శిస్తున్నది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కాలయాపన చేయడమే తప్ప మరేమీ కాదన్నది నిజం.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు మిషన్ మోడ్ తో పని చేస్తున్నారు. ఏపీ నీటి ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నది. ఈ టైమ్ లో బహుశా కేసీఆర్ ఉండి ఉంటే..పరిస్థితి వేరేలా ఉండేదని బిఆర్ఎస్ నేతలంటున్నారు. విపక్షంలో ఉండి ఏం చేస్తున్నారు అన్నదే ప్రశ్న. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజలను జాగృతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి చేయాల్సి ఉండే. ఆ పని చేయకుండా రాజకీయం మాత్రమే చేస్తుండటం తెలంగాణ సమాజాన్ని కించపరచడమే.పోలవరం పూర్తయితే గోదావరి జలాల్లో ఏపీకి వాటా పెరగడం ఖాయం. అటు కృష్ణా..ఇటు గోదావరి జలాలు పూర్తి స్థాయి మన వాటా మనకు దక్కాలంటే… పెండింగ్ పనులను పూర్తి చేయడమే పరిష్కారం. దీనికి తోడు బలమైన నాయకత్వ ప్రభుత్వం తెలంగాణలో ఉండాలి. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నీటి వినియోగంపై జలసంఘానికి ఇచ్చి ప్రజలను మోసం చేసిన విధం ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు.
మరో వైపు మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ ఎడా పెడా అప్పులు చేసి సీఎం కుర్చీలోంచి దిగిపోయారు. 8లక్షల కోట్లు అప్పులు చేశారని అధికార పార్టీ ఆరోపిస్తుంటే…నాలుగున్నర లక్షలు అని బిఆర్ఎస్ అంటోంది. ఏదైతేనేం…అప్పులు అయ్యాయన్నది వాస్తవం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుల విషయంలో తక్కువేం కాదు. ప్రతి కుటుంబం పై ఇప్పుడు 9 లక్షల అప్పు ఉంది. ఆదాయం, ఖర్చుల మధ్య భారీ తేడా ఉంది. మొన్నటి రాష్ట్ర బడ్జెట్ లో అంతా అంకెల గారడి కనిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు అరకొర మాత్రమే. ఖర్చు ఎక్కువ…ఆదాయం తక్కువ అన్నది సుస్పష్టం.
కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని విస్మరిస్తూ… ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ.. రాజకీయం చేస్తున్నది. జీఎస్టీ పేరిట ప్రజల నుండి వసూలవుతున్న డబ్బులను తిరిగి రాష్ట్రాలకు జమ చేసే విధానంలో కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఒక రకంగా రాష్ట్రాలు కేంద్రాన్ని ఆదుకోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి మారాల్సి ఉంది.
ఇక నియామకాల విషయానికి వస్తే… స్వరాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకు దక్కుతాయని సంతోషపడిన నిరుద్యోగుల ఆశలు కేసీఆర్ ప్రభుత్వంలో ఆవిరయాయి. లోపభూయిష్ట నోటిఫికేషన్లు జారీ చేయడం వల్ల కోర్టుకెక్కారు కొందరు. లక్షా 26వేలు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా..భర్తీ చేసింది 67వేలు మాత్రమే. కాంగ్రెస్ ప్రతీ ఏటా 2లక్షలు ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ కేలండర్ ప్రకటిస్తామని హామీనిచ్చింది. అధికారంలోకి వచ్చిన తరవాత కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ల ఫలితాలను వెల్లడించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ…తామే ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. జనం నవ్వుకుంటున్నారన్న సోయి కాంగ్రెస్ అధిష్టానం, ప్రభుత్వ పెద్దల్లో లేదు. భవిష్యత్ లో ఉద్యోగాలను భర్తీ చేసినా..దిగజారిన ఆర్థిక పరిస్థితి అందుకు పర్మిట్ చేసేలా లేదు. రోజువారీ ఖర్చులకు, ఉద్యోగుల జీతభత్యాలకు సైతం అప్పులు చేయాల్సిన దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది.
ఎలా చూసినా సంపద సృష్టించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడం ఎలా అన్నదే ప్రశ్న.రాజకీయాలు మాని సీరియస్ గా పాలనపై దృష్టి పెట్టడం, అవసరం అనుకున్న పథకాలను కంటిన్యూ చేయడం, పొదుపు చర్యలు పాటిస్తూ…ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిని వివరించాలి. తెలంగాణ అమరుల ఆకాంక్షలు, సమాజం కోరుకుంటున్న ఆశలను నెరవేర్చడానికి వజ్ర సంకల్పంతో ముందుకు సాగాలి. ఇవన్నీ సగటు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నవి. రాజకీయ పార్టీలు వీటిపై దృష్టి పెట్టి…తెలంగాణను సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికాయుతంగా కృషి చేయాల్సి ఉంది.





