అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వ‌హిస్తున్నాం..

  • ఈనెల 19 నుంచి 21 వరకు తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్ – 2025”
  • రెండు ప్లీన‌రీలు, మొత్తం 65 ఉపన్యాసాలు,
  • జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, సంస్థల ప్రతినిధులు హాజ‌రు 
  • వివ‌రాలు వెల్ల‌డించిన కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి

కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 18 : విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ సదస్సు 2025 (Telangana science congress – 2025) ను అత్యంత  ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి (KU VC Prathap Reddy) అన్నారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్‌లో వైస్ ఛాన్స్‌ల‌ర్ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ బృందంతో కలిసి మీడియా సమావేశంలో సైన్స్ కాంగ్రెస్ సదస్సు వివరాలను వెల్లడించారు. మంగ‌ళ‌వారం నుంచి ఈనెల 21 వరకు జరిగే “తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్ – 2025” సదస్సును జయప్రదం చేయాలని కోరారు. గోల్డెన్ జూబ్లీ ప్రారంభ సంవత్సరం సందర్భంగా కేయూలో తెలంగాణ సైన్సు కాంగ్రెస్ నిర్వహించుకోవ‌డం గర్వకారణమన్నారు. ఈ సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య బి.వెంకట్రామరెడ్డి, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ఆచార్య సీహెచ్.మోహన్ రావు, కార్యదర్శి ఆచార్య ఎస్.సత్యనారాయణ, కోశాధికారి ఆచార్య ఎస్ఎం.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజుల సైన్సు కాంగ్రెస్ ప్రారంభ సమావేశానికి డీఆర్‌డీఓ పూర్వ చైర్మన్, భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖ శాస్త్రీయ సలహాదారు డా. జి.సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 750 సంక్షిప్త పరిశోధన పత్రాలు అందాయన్నారు. 626 మంది తెలంగాణ సైన్సు కాంగ్రెస్ లో పాల్గొనటానికి నమోదు చేసుకున్నారన్నారు. పలువురు స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక సైన్సు కాంగ్రెస్‌ లో రెండు ప్లీనరీ సెషన్లు, వాటిలో ఐదు విస్తృత ఉపన్యాసాలు ఉంటాయన్నారు. ఐదు థీమాటిక్ ఇంటివైటెడ్ టాక్స్‌లో మొత్తం 65 ఉపన్యాసాలు, జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. పదహారు ఎంపిక చేసిన లెక్చర్లు ప్రత్యేక అంశాలపై ప్రస్తుత తరానికి మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సైంటిఫిక్ ఎగ్జిబిషన్ పాఠశాలల సైన్స్ టీచర్ల కోసం ప్రత్యేక సెషన్లు, ఇస్రో, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. భారతదేశం తొలి ఉపగ్రహం “అర్యభట్ట” నింగిలోకి వెళ్ళి 50 సంవత్సరాలు పూర్తి కావడం యాదృచ్చికమని హర్షం వ్యక్తం చేశారు. సైన్సు కాంగ్రెస్ జరగడం విశిష్ఠతను పొందిందని పేర్కొన్నారు. అక్టోబర్ లో యూనివర్సిటీ కె-హబ్, రాష్ట్ర టీ-హబ్ కలిసి గోల్డెన్ జూబ్లీ కిక్‌స్టార్ట్ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి, నిర్మాణాలు, కొత్త ప్రాజెక్టులపై ప్రతిపాదనలు పంపినట్లు కూడా తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ సైన్సు కాంగ్రెస్ – 2025 కమిటీల బాధ్యతలు వహిస్తున్న సభ్యులు, మీడియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *