ఉరకలేస్తున్న గోదావరి

మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరువలో నీటిమట్టం

ఏటూరునాగారం, ప్రజాతంత్ర, ఆగస్టు 19: గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది (Godavari River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాద హెచ్చరికలు ఘటిస్తూ ఉరకలు వేస్తుంది. ఎగువ నుండి గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మంగళవారం సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరికు చేరువలో ఉంది. గోదావరి నదికి ఎగువన నున్న కడెం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తుపాకులగూడెం బ్యారేజీ లకు భారీగా వరద నీరు భారీగా చేరడంతో అధికారులు దిగువ ప్రాంతాలకు ఈ ప్రాజెక్టుల నుండి వరద నీటిని వదిలేస్తున్నారు. దీంతో గోదావరి నదీ ఉగ్రరూపం దాల్చి దిగువ ప్రాంతానికి ఉరకలు వేస్తుంది. సముద్రమట్టానికి 14.800 మీటర్ల ఎగువకు రాగానే మొదటి ప్రమాద హెచ్చరికను నీటిపారుదల శాఖ అధికారులు జారీ చేసే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుండి గోదావరి క్రమ క్రమేపి పెరుగుతూ ఉంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గంటకు సుమారు 1 సెంటి మీటర్ ఎత్తు చొప్పున గోదావరి పెరుగుతూ వస్తుంది. సాయంత్రం 6 గంటల సమయంలో 14.230 మీటర్లకు చేరింది. మరో 6 సెంటి మీటర్లు పెరగగానే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
గోదావరి ఉధృతిని పరిశీలించిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. గోదావరి నది ఉగ్రరూపానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉన్నందున మండలంలోని రామన్నగూడెం మండల కేంద్రంలోని ఓడవాడ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి నది తీవ్రతను మించి పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలలోకి వాగుల నుండి వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో పంట పొలాలు సైతం వరద నీటిలో మునిగిపోయాయి. ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కింద నుండి వరద నీరు వెళ్లడంతో అటుగా వెళుతున్న పర్యాటకులు వీక్షించి ఆనందపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *