బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై డిజిపి అభినందనలు*
ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో తెలంగాణ స్పెషల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నిఖత్ జరీన్ విజయం పట్ల డిజిపి శివధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహిళల 51 కేజీల ఫైనల్ పోటీలో ఆమె తన ప్రత్యర్థిపై 5-0 తేడాతో ఘన విజయం సాధించడం ఆమె సామర్థ్యానికి, అంకితభావానికి నిదర్శనమని డిజిపి కొనియాడారు. “గోల్డ్ మెడల్ సాధించి, తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిన నిఖత్ జరీన్‌ను అభినందిస్తున్నాను. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శం” అని డిజిపి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ కుటుంబం తరఫున నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డిజిపి ఆకాంక్షించారు.





