రూ. 2198.83 కోట్లతో నూతన పనులకు శ్రీకారం
సచివాలయంలో పనుల జాతర-2025 పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క
పుట్టల భూపతి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా “పనుల జాతర–2025” (Panula Jathara 2025) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలోని పుట్టల భూపతి గ్రామంలో పనుల జాతరను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దినసరి అనసూయ సీతక్క లాంఛనంగా ప్రారంభిస్తారు. “ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు గ్రామీణాభివృద్ధి బాటలో ఈ పనుల జాతర కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఇది రాజకీయాలకు అతీతమైన పండుగ. ఎమ్మెల్యేలంతా ఈ పనుల జాతరలో పాలుపంచుకోవాలి” అని మంత్రి సీతక్క ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక లేఖలు రాసి, తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయం వేదికగా పనుల జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క, పనుల జాతర లో భాగంగా చేపట్టి పనుల వివరాలను వెల్లడించారు. ఈ జాతరలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు అమలు చేయనున్నారు. పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, చెక్‌డ్యాములు, ఊటకుంటలు, ప్లాస్టిక్ వెస్ట్ యూనిట్లు, గ్రామీణ రహదారులు, కమ్యూనిటీ టాయిలెట్లు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటి పనులను చేపడతారు.
ఈ పనుల జాతరలో రూ. 2,199 కోట్ల తో 1,01,589 పనులను చేపట్టనున్నారు. మార్చ్ 2026 నాటికి అన్ని పనులను పూర్తి చేసేలా కార్యచరణ రూపొందించారు. గతేడాది నవంబర్‌లో రూ. 4,529 కోట్లతో నిర్వహించిన “పనుల జాతర–2024” విజయవంతం అయినట్లుగానే ఈ దఫా పనుల జాతరను విజయవంతం చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. “ఈ పనుల జాతర పల్లెల్లో ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, జల సంరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, జీవన ప్రమాణాల పెరుగుదలకూ దోహదం చేస్తుంది. పల్లెల్లో నిజమైన అభివృద్ధి పండుగ జరగనుంది” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల జాబితాను జిల్లా డీఆర్‌డీఓ అధికారులు సిద్ధం చేశారు. పనుల జాతరలో భాగంగా ప్రతి గ్రామంలో ఇప్పటికే పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, కొత్త పనులకు శంకుస్థాపన జరగనుంది. దీంతో మరోసారి పల్లెల్లో అభివృద్ధి పండుగ వాతావరణం నెలకొననుంది.





