- లక్ష మందితో ఇందిరమ్మ గృహప్రవేశ మహోత్సవం..
- బెండలంపాడులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం..
- పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు ఇండ్లు
- ఈనెల 21న సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : అతిత్వరలో పేదల కల సాకారం కాబోతున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinvas Reddy)అన్నారు. ఈనెల 21న భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చండ్రుగొండ మండలం బెండలంపాడు గ్రామంలో ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై రెవెన్యూ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణపాయం తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రామదాస్ నాయక్, మట్ట రాగమయితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో పేదలకు ఇల్లు అన్న కల కలగానే మిగిలిపోయిందని అన్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ పథకాన్ని(Indiramma Housing scheme) పునఃప్రారంభించి, మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్ల మంజూరుతో పేదవాడి చిరకాల వాంఛను ఈ పేదోడి ప్రభుత్వం అయినా ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. శ్రావణ మాసం 21న శుభ ముహూర్తంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండలంపాడు గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ గ్రామంలో మొత్తం 312 ఇండ్లు మంజూరవగా వాటిలో 72 ఇండ్లు పూర్తయ్యాయి. అందులో 27 ఇండ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదగా గృహప్రవేశం జరగనుందని వివరించారు.
గతంలో ఏ పేదవాడికీ అందని ఇళ్లను ఇప్పుడు ఈ ప్రభుత్వం పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి అర్హునికి అందజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇళ్లలో, సుమారు 2.5 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన ఇళ్లు కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకంగా అర్హులైనవారికి ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేశాం. భద్రాద్రి రాముని సన్నిధిలో గతంలో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఈరోజు అదే భద్రాద్రి నేలపై ముఖ్యమంత్రి (CM Revanth Reddy) చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం జరగడం ఒక చారిత్రక ఘట్టమని తెలిపారు. జిల్లాలో జరిగే ఈ మహోత్సవానికి సుమారు ఒక లక్ష మంది ప్రజలు పాల్గొంటారని అంచనా. కాబట్టి, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని తెలిపారు.
సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఇదీ..
ఈనెల 21 మధ్యాహ్నం 2 గంటలకు చంద్రుగొండకు ముఖ్యమంత్రి చేరుకుంటారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మధ్యాహ్నం 2:10 బెండలంపాడు చేరుకుని 2:20 కు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని, ఒక్కో ఇంటి వద్ద 15 నిమిషాలపాటు లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 3:00 గంటల నుంచి ప్రజాసభలో పాల్గొని ప్రసంగిస్తారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ వివరించారు.





