– రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలి
– అన్ని చోట్ల జాతీయ, పార్టీ పతాకాలను ఆవిష్కరించాలి
– బీఆర్ ఎస్ శ్రేణులకు కె.టి.ఆర్. పిలుపు
పధ్నాలుగేళ్ల అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసిఆర్ గారి సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జూన్ రెండవ తేదీన పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదన చారి పాల్గొని జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
అలాగే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ జెండా తోపాటు పార్టీ జెండాలను ఎగరేసి సంబురాలు జరపాలని కోరారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాలు , మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాలలో జాతీయ పతాకంతోపాటు గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అవతరణ సంబురాలను ప్రజలతో కలిసి జరుపుకోవాలని అన్నారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు , విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని కేటీఆర్ గుర్తు చేశారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్ కు కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు , మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని కేటీఆర్ అన్నారు.





