~ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 10: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు జేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు మాధవ్ ఇచ్చిన భారతదేశ చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బిజెపి అధికారిక విధానమా అని ప్రధాని నరేంద్ర మోదీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ .. అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుని, అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా దేశ చిత్రపటాన్ని ఉపయోగించారు.. ఏపీ మంత్రికి బహుమతిగా ఇచ్చిన చిత్రపటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని మాత్రమే చూపడం దారుణం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించిందని, ఇది పూర్తిగా అనుచితమైనది అని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం? ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా? అని ప్రధానమంత్రి మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై మీరు వెంటనే స్పష్టత ఇవ్వాలి అని కోరారు. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



