వొచ్చేదెవరో.. వెళ్లేదెవరో?

  • మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికే ఛాన్స్
  • ఆశల పల్లకిలో పలువురు నేతలు
  • ఉంటామో, ఊడుతామోన‌ని మంత్రుల్లో గుబులు 
  • అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం విస్తరణ
  • సామాజిక న్యాయంపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion) అనగానే ఆ పదవిని ఆశించేవారు ఒకరినిమించి పోటీ పడడమన్నది సహజం. మంత్రివర్గంలో ఉన్నవారికి తమ పదవిపై గుబులు కూడా అంతే ఉంటుంది. కొత్తగా తీసుకునే మంత్రుల విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేస్తారన్న విషయం విస ్తతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మార్పుచేర్పుల్లో తమ పదవి ఉంటుందో లేదోనన్న ఆందోళన కొందరు మంత్రుýకు నిద్రపట్టకుండా చేస్తున్నది. ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరు లేక ముగ్గురికి ఉద్వాసన పలికే అవకాశాలున్నట్లు వినవస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయింది. ఈ కాలంలో కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో పురోగతిని సాధించలేకపోయారన్నది ఒక అంశం కాగా, వారిపై వస్తున్న పలు ఆరోపణల రీత్యా వారిని పక్కకు పెట్టాలన్న ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, అధిష్థానానికి కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రివర్గంలో మొత్తంగా 18మందిని చేర్చుకునే అవకాశముంటుంది.

ప్రస్తుతం 16మంది కొనసాగుతుండగా మరో ఇద్దరికి మాత్రమే కొత్తగా మంత్రివర్గంలో అవకాశముంది. అయితే వివాదగ్రస్తులు, తమ శాఖకు న్యాయం చేయలేకపోతున్న ఇద్దరు లేక ముగ్గురు మంత్రులను తొలగించే పక్షంలో మరో ముగ్గురికి కొత్తగా మంత్రివర్గంలోకి అవకాశం లభించవచ్చనుకుంటున్నారు. అంటే అయిదుగురికి కొత్తగా అవకాశం లభిస్తుందన్నమాట. ఈ అయిదు మంత్రివర్గ స్థానాల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాదాపు 16 మంది తమ గాడ్‌ఫాదర్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈసారి విస్తరణలో సామాజికవర్గాల సమతుల్యతను పాటించే విషయంలో ఇప్పటికే కసరత్తు మొదలైంది. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మంత్రివర్గాన్ని విస్తరిస్తారనుకున్నారు. కానీ దేశంలోని అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో అధిష్ఠానంతోపాటు, రాష్ట్ర ముఖ్యమంత్రికూడా బిజీగా ఉండడంతో కొద్ది రోజులపాటు వాయిదా పడింది.

ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ ఉంటుందనుకుంటున్నారు. కాగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఈసారి లంబాడా, మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలుస్తున్నది. మంత్రి పదవి కోసం రెడ్డి సామాజిక వర్గంనుండి పోటీపడుతున్న వారిలో ప్రధానంగా ఆరుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. గత ఎన్నికల సమయంలోనే తనకు మంత్రి పదవిని ఇస్తానన్న అధిష్ఠానం ఇంతవరకు ఇవ్వలేదంటూ చాలాకాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మర్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మహిళా మంత్రలు ప్రాతినిధŠ్యం వహిస్తుండగా ఖమ్మంలోలాగా మరొకరికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ వినవస్తున్నది.

ఒకవేళ ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ముందు వరుసలో దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి నిలవగా సీనియర్ నేతగా రేవూరి ప్రకాశ్‌రెడ్డికూడా పోటీలో ఉండే అవకాశముంది. లంబాడ సామాజికవర్గంలో రాంచంద్రనాయక్, బాలూనాయక్ పేర్లు వినవస్తుండగా, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌కూడా రేస్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. బీసీల విషయానికొస్తే ప్రధానంగా ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రచారంలో ఉంది. అమెకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాదిరి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని అధిష్ఠానం గతంలో హామీ ఇవ్వడంతోపాటు, గత మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆమె పేరు బాగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను కూడా మంత్రిగా తీసుకునే అవకాశాలున్నాయనుకుంటున్నారు.

సీఎంకు అతి దగ్గరైన ఆది శ్రీనివాస్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఏమైనా అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం అన్ని వర్గాలను కలుపుకునిపోయేవిధంగా అధిష్థానంతో చర్చించిన తర్వాతే మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నాయి. పదవులు కోల్పోయే వారికి అవమానం జరుగకుండా వారికి పార్టీలో ముఖ్య పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ వంటి కేబినెట్ హోదాకు తగ్గని పదవుల్లో వారిని నియమించనున్నట్లు తెలుస్తున్నది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *