రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు..

  • ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క‌ల్పించేలా ముసాయిదా బిల్లు
  • 10954 గ్రామ పరిపాలన అధికారుల నియామకం
  • వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం

Telangana Cabinet meeting | హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : తెలంగాణ‌ కేబినెట్‌స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా బిల్లును ఆమోదించిన‌ట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని అన్నారు. గురువారం రాష్ట్ర స‌చివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ స‌మావేశంలో తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల గురించి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్  మీడియా సమావేశంలో వెల్ల‌డించారు. ఈసంద్భంగా ఆయ‌న మాట్లాడూతూ.. ఎస్సీ కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ మార్చి 2 వ తేదీన తమ రెండో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ ఇచ్చిన మొదటి నివేదికలో చేసిన సిఫారసులను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతధంగా ధ్రువీకరించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన 71 విజ్ఞప్తులను రెండో విడత లో కమిషన్ పరిశీలించింది. కమిషన్ ఇచ్చిన నివేదిక లోని అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదా కు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా ఒక బిల్లు ముసాయిదా. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు ముసాయిదా తయారు చేశారు. వేర్వేరుగా ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. 2017 లో అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ల పాత బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

ఫ్యూచర్ సిటీ డెవెలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు

ఫ్యూచర్ సిటీ డెవెలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు (ఎఫ్ సీడీఏ )కు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.  7 మండలాలు, 56 గ్రామాలతో ఎఫ్ సీడీఏ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఉన్న దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ ని అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 36 గ్రామాలను హెచ్ఎండీఎ పరిధి నుంచి తొలగించి ఎఫ్‌సిడిఎ కు అప్పగిస్తారు. ఫ్యూచర్ సిటీ డెవెలప్మెంట్ అథారిటీకి రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ కలిపి 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హెచ్ఎండీఎ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదన ను కేబినెట్ ఆమోదించింది. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో హెచ్ఎండీఎ పరిధి పెరుగనుంది. ఈ విస్తరణతో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు HMDA పరిధిలో కలుస్తాయి.

ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ కి ఆమోదం తెలిపిన కేబినెట్.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీ రూప కల్పన చేసిన ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు సెర్పఅధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధ్వర్యంలో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మహిళా శక్తి సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకు రానున్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏండ్ల నుంచి 65 ఏళ్లకు పెంచి.. గ్రూప్ ల్లో చేరే కనీస వయస్సును 18 ఏళ్ల నుంచి 15 ఏళ్ల కు తగ్గించారు.

టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం. అందుకు వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ -1987 కు సవరణలు. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 27 స్పెషల్ టూరిజం ఏరియాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం రాబోయే 5 ఏళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త పాలసీకి రూపకల్పన.

మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ లో ఆతిథ్యం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 140 దేశాలు పాలుపంచుకునే ఈ వేడుకలను తెలంగాణ కు ప్రపంచంలో పేరు తెచ్చేలా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 10954 గ్రామ పరిపాలన అధికారుల నియామకానికి ఆమోదం తెలిపిన మంత్రి వర్గం. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో నియమించాలని నిర్ణయం. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని తీర్మానించారు. గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీల కు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో రాయికుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ఈఎస్ఐ (ESI) ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారాలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో 361 పోస్టుల కు ప్రభుత్వం ఆమోదించింది.
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్ పోస్టులకు, 165 అవుట్ సోర్సింగ్ .. మొత్తం 495 పోస్టులకు ఆమోదం తెలిపిన‌ట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

కేబినెట్ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు సంబంధించి జరిపిన కుల సర్వే బలహీన వర్గాల మేదావులు ,కుల సంఘాల నేతల సమావేశం సంప్రదింపుల తరువాత మిస్ అయిన వారికి మరోసారి అవకాశం ఇచ్చామ‌ని తెలిపారు. రాబోయే శాసన సభ సమావేశాల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ముసాయిదా చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింద‌ని వివ‌రించారు. రాజకీయ, విద్య ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం బీసీ లకు రిజర్వేషన్లు ఉండాలని వేరు వేరు బిల్లులు పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంద‌న్నారు.గతంలో 2017 లో 37 శాతానికి తీసుకున్న నిర్ణయం బిల్లు వెనక్కి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్టు కేబినెట్ నిర్ణయం తీసుకుంద‌న్నారు. ఫిబ్రవరి 4 2024 న ఆమోదించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టీనప్పటి నుండి ఫిబ్రవరి 4 2025 వరకు చట్టని తీసుకొచ్చి నిర్ణయం నుండి నివేదిక వరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంద‌ని మంత్రి పొన్నం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *