సామాజిక న్యాయం పునాదిపై ఆర్థిక అభివృద్ధి కాంగ్రెస్ సిద్ధాంతం
పెట్టుబడులకు సరైన వేదిక హైదరాబాద్
అసోచామ్ సదరన్ కౌన్సిల్ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: ఆర్థిక అభివృద్ధితోపాటు మానవీయ కోణాన్ని జోడిస్తూ తమ ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి ఓ కొత్త నిర్వచనాన్ని రచిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. హైదరాబాదులో శుకవ్రారం జరిగిన the westin, mindspaceలో అసోచామ్ సదరన్ CSR & sustainability కౌన్సిల్ సదస్సు, అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక, పర్యావరణ బాధ్యతలతో కూడిన తెలంగాణను నిర్మించేందుకు యావత్ క్యాబినెట్ కట్టుబడి పనిచేస్తున్నదన్నారు. అపార వనరులు ఉన్నా అసమానతలు ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నామన్నారు. ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక వ్యవస్థలు పనిచేయలేవని స్పష్టం అయింది,. ఇప్పుడు కేవలం ‘లిఫ్ట్ ఆల్’ అందరినీ అభివృద్ధి చేయాలన్నది అనివార్యం అని అన్నారు. ఆర్థిక వృద్ధి సామాజిక న్యాయం పునాదిపై నిలవాలన్నది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఆ సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తున్నదని చెప్పారు. పారిశ్రామికవేత్తల పని ప్రశంసల కోసం కాదు సామాజిక మార్పు కోసం అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థలు CSR(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు ఖర్చు చేసేందుకు రాష్ట్రం సరైన వేదిక అని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో CSR నిధులు ఖర్చు చేయాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైన ప్రాంతమ న్నారు. హెల్త్, ఫార్మా, ఐటీ, ఫుడ్ గ్రెయిన్స్ వంటి రంగాల్లో తెలంగాణది తిరుగులేని ప్రస్థానమన్నారు.
పేద విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో విద్య
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో పేద విద్యార్థులకు విద్య అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున వంద పాఠశాలలు మంజూరు చేశామని చెప్పారు. ’స్కూల్స్ నిర్మించడం కాదు.. వాటిని నిర్వహించడమే సమస్య అని ఓ మిత్రుడు అన్నారు.. ఈ నేపథ్యంలో నిర్వహణ కోసం కార్పొరేట్ కంపెనీలను సంప్రదించగా గొప్ప స్పందన కనిపించింది..ఆ పాఠశాలలన్నిటినీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్పొరేట్ కంపెనీలు 15 రోజుల వ్యవధిలోనే హామీ ఇవ్వడం గమనార్హం‘ అని చెప్పారు. గతంలో నిర్మించిన వంద ఐటిఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. CSR అంటే లాభాల్లో రెండు శాతం ప్రజాహిత కార్యక్రమాలకు కేటాయించడానికి చట్టపరమైన బాధ్యతగా చూస్తాం,. కానీ నేను ఒక భిన్నమైన దృష్టి కోణాన్ని సమావేశానికి హాజరైన వారితో పంచుకోవాలని కోరుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సమాజాన్ని పరిగణనలోకి తీసుకోని అభివృద్ధి సరైనది కాదన్నారు. అభివృద్ధి ఫలితాలు కేవలం కార్పొరేట్ ఆఫీసులకే పరిమితం కాకూడదు అవి ప్రభుత్వ పాఠశాలలోని బాలికలకు, ఇబ్బందుల్లో ఉన్న రైతులకు, అంతరించిపోతున్న గ్రామీణ కళాకారులకు చేరాలన్నారు. పల్లెల్లో యువతకు గ్రీన్ స్కిల్స్‌లో శిక్షణ, మహిళా సంఘాలకు కేవలం నిధులు మాత్రమే కాకుండా యంత్రాలు, శిక్షణ, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలని, ఒకేసారి నిధులు కేటాయించడం కాక దీర్ఘకాలిక అభివృద్ధికి మార్గదర్శకులుగా మారుద్దాం అని డిప్యూటీ సీఎం అన్నారు. మీరు పని చేసే ప్రాంతాల్లో ప్రజల జీవన అనుభవాలను తెలుసుకోవాలని, స్థానిక ప్రజా సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ దాసరి హరిచందన, నిర్వాహకులు సురేష్ చుక్కపల్లి, బారుల్ ఇస్లాం, అభిషేక రంజన్, కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.





