లక్కీ డ్రాలో ప్రభుత్వ టీచర్‌కు మద్యం షాపు        

– స‌ర్వీసు రూల్స్ వ‌ర్తించ‌వా?        
– రూల్స్ కు విరుద్ధ‌మంటూ పాత డీల‌ర్ ఫిర్యాదు
– రుజువైతే క్ర‌మ‌శిక్ష‌ణ‌ చ‌ర్య‌లు:  డీఈవో
– త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం: క‌లెక్ట‌ర్‌    

మహబూబ్ న‌గర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27:  మహబూబ్‌నగర్ జిల్లాలో మద్యం షాపుల లాటరీ (లక్కీ డ్రా) పెద్ద వివాదానికి తెర తీసింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జరిగిన ఈ డ్రాలో ఓ మద్యం దుకాణం లైసెన్స్  ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కు దక్కినట్లు స‌మాచారం. ఇది ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు (సర్వీస్ రూల్స్), నైతికతపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. జిల్లా కలెక్టరేట్ లో ఎక్సైజ్ శాఖ సోమవారం నిర్వ‌హించిన‌ లక్కీ డ్రాలో మహబూబ్‌నగర్ పట్టణంలోని ధర్మాపూర్ షాప్ నెం.16కు పుష్ప అనే పిఈటి దరఖాస్తు చేసుకోగా ఆమె నెంబర్ 17కి లాటరీ వ‌చ్చింది. రాష్ట్ర‌ ఎక్సైజ్ నిబంధనల  ప్రకారం మద్యం షాపు లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్నవారు, ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడినవారు, ఎక్సైజ్ రెవెన్యూ బకాయిదారు ( డిఫాల్టర్ ) అయినవారు, సమర్థ న్యాయస్థానం ద్వారా దివాలా తీసినట్లుగా ప్రకటించబడినవారు అన‌ర్హులు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మద్యం వ్యాపారంలో పాల్గొనడానికి వీల్లేదని సర్వీస్ రూల్స్ స్ప‌ష్టం చేస్తున్నాయి.  ప్రభుత్వ టీచర్ కూడా ప్రభుత్వ ఉద్యోగే కాబట్టి ఆయన లేదా ఆమె మద్యం షాపు నడపడం లేదా లైసెన్స్ కలిగి ఉండటం సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంది. ఎక్సైజ్ శాఖ నిబంధనలలో ఉద్యోగి అని ప్రత్యేకంగా లేకపోయినా ఉద్యోగి నడుపుతున్నట్లయితే అది సర్వీస్ రూల్స్ ఉల్లంఘనే అవుతుంది. అయితే ఆ టీచర్ తన పేరు మీద కాకుండా తన భార్య లేదా కుటుంబ సభ్యుల పేరు మీద దరఖాస్తు చేసుకుని ఉంటే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం అది అభ్యంతరకరం కాదు, కానీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి  ప్రకారం ఉద్యోగి తన కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఈ వ్యాపారంలో పరోక్షంగా పాల్గొనకూడదనే నిబంధనలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒక ఉపాధ్యాయిని మద్యం వ్యాపారంలో ఉండటం నిబంధనల ఉల్లంఘన కిందకు వ‌స్తుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ విషయంపై ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ స్పందిస్తూ మా నిబంధనల ప్రకారం అనర్హుల జాబితాలో లేకపోతే లైసెన్స్ మంజూరుకు అభ్యంతరం ఉండదు. అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల ఉల్లంఘన అవుతుందా లేదా అనే అంశాన్ని సంబంధిత శాఖ విచారించాలి అని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఒక టీచర్ మద్యం వ్యాపారంలో ఉండటం విద్యారంగానికి, ప్రభుత్వ ప్రతిష్టకు ఏమేరకు మేలు చేస్తుంది.. ఆ టీచర్ వ్యాపారంలో పాల్గొన్నట్లు రుజువైతే క్రమశిక్షణా చర్యలు  తీసుకుంటారా అని జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రశ్నించగా ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయిని వ్యాపారం నిర్వహించడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధం.. దీనిపై విచారణకు ఆదేశిస్తాము. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణా చర్యలు తప్పవు’ అని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయినికి మద్యం షాపు లక్కీ డ్రా వచ్చిందని  జిల్లా కలెక్టర్ కు పాత డీలర్ ప్రతాప్  ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ వివరణ ఇస్తూ మద్యం షాపుల లక్కీ డ్రాలో ప్రభుత్వ ఉపాధ్యాయినిపై వచ్చిన ఫిర్యాదుపై  విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఆదాయం కోసం లాటరీ ద్వారా లైసెన్స్‌లు ఇస్తుంటే మరోవైపు అదే ప్రభుత్వంలోని ఉద్యోగి మద్యం వ్యాపారంలోకి రావడం నైతిక ప్రమాణాలకు విరుద్ధమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఎక్సైజ్, విద్యాశాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *