తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 21: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అక్రమాల్లో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రమేయముందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. పదేళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని, చాలామంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. కేటీఆర్, కవితతోపాటు హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సంపత్‌కుమార్‌ను తక్షణమే విచారించాలని డిమాండ్ చేశారు. వారి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ క్రికెటర్లకు అన్యాయం జరిగిందన్నారు. సమ్మర్ క్యాంపులను ఉచితంగా నిర్వహించాల్సి ఉండగా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ అందుకు తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. ఆ డబ్బంతా ఎక్కడికిపోయిందంటూ ప్రశ్నించారు. అవకాశాల కోసం తెలంగాణ క్రికెటర్లు ఎదురుచూస్తున్నారన్నారు. హెచ్‌సీఏలో జరిగిన అక్రమాల వివరాలను సీఐడీ, ఈడీకి అందజేస్తామన్నారు. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేయాలని, హెచ్‌సీఏ ఎన్నికపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలిలని కోరారు. క్రికెట్‌తో సంబంధం లేని జగన్మోహన్‌రావు ఎలా అధ్యక్షుడు అయ్యాంంటూ ఆయన వెనుక కేటీఆర్, కవిత ఉన్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా వోట్లు వేస్తారు అని నిలదీశారు. ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా ఎన్నికల్లో పాల్గొన్నారని తెలిపారు. 155 క్రికెట్ అసోసియేషన్లు యాక్టివ్‌లో లేకున్నా వాటికి ఎన్నికలు ఎలా నిర్వహించారన్నారు. వెంటనే ఆ ఎన్నికలు రద్దు చేసి క్లబ్బులను ప్రక్షాళన చేయాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు.




