సింగరేణికి కేసీఆర్‌ ఎంతో చేశారు

టీబీజీకేఎస్‌ నేతల సమావేశంలో కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి సంస్థ కోసం, కార్మికుల చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ అనుంబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) నాయకులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ఈ కార్మిక సంఘం బుధవారం సమావేశమైంది. పదేళ్ల కాలంలో సింగరేణితోపాటు ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్‌ పనిచేశారని ఆయన చెప్పారు. ఈ కార్మిక సంఘం బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా కార్యక్రమాలను చేపట్టాలని, ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించింది. పార్టీ తరఫున సంఘానికి ఇన్‌చార్జిగా ఇకపై బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వ్యవహరిస్తారని, ఆయన ఆధ్వర్యంలో సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి సమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతోపాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని కూడా నిర్ణయించారు. కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించింది కూడా బీఆర్‌ఎస్‌ పార్టీయేనని కేటీఆర్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాలకు అమలు చేయడానికి వీలుకాని హామీలు ఇచ్చిన తీరుగానే సింగరేణిని కూడా మోసం చేసిందని, సింగరేణి గనుల ప్రైవేటీకరణ కోసం బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కుట్రలపై గళమెత్తాలని నిర్ణయం తీసుకున్నారు. బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు సహకారం అందిస్తుందని, కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కార్మికుల కోసం పార్టీ లీగల్‌ సెల్‌ కూడా పూర్తిస్థాయి అండగా ఉంటుందన్నారు. త్వరలోనే సింగరేణి ప్రాంతంలో బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *