హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: జైపూర్‌లో ఈనెల 19, 20 తేదీల్లో జరిగే టాక్ జర్నలిజం 2025 కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య వక్తగా పాల్గొననున్నారు. ఇది దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొనే అత్యంత ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటి. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తున్న, విజన్ ఉన్న వినూత్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కెేటీిఅర్ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా తెలంగాణలో చేసిన పాలనా మార్పులు, సాధించిన విజయాల నేపథ్యంలో ఆయనను ముఖ్యవక్తగా అహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణను టెక్నాలజీ, పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పాత్ర కీలకమైందని, అంతేకాక దేశ రాజకీయాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరచగల నాయకుడిగా ఆయనను నిర్వాహకులు పేర్కొన్నారు. టాక్ జర్నలిజం అనేది దేశవిదేశాల జర్నలిస్టులు మీడియా రంగంలోని మార్పులు, ధోరణులు, సవాళ్లపై చర్చించేందుకు కలుసుకునే ఒక ప్రముఖ వేదిక. ఇప్పటివరకు జరిగిన ఎనిమిది ఎడిషన్లలో రాజ్‌దీప్ సర్దేశాయి, రవీశ్‌కుమార్, బర్కాదత్, సౌరభ్ ద్వివేది, సుహాసిని హైదర్ లాంటి ప్రముఖ భారతీయ జర్నలిస్టులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా ఎడ్వర్డ్ స్నోడెన్, పులిట్జర్ బోర్డు మాజీ అధ్యక్షుడు యూజిన్ రాబిన్సన్, ఐసీఐజె ఎడిటర్ గెరార్డ్ రైల్, గార్డియన్‌కు చెందిన నిక్ డేవిస్, సండే టైమ్స్‌కు చెందిన క్రిస్టినా ల్యాంబ్ వంటి ప్రముఖులు ఈ వేదికపై పాల్గొన్నారు. గతంలో సచిన్ పైలట్, అసదుద్దీన్ ఒవైసీ, సుబ్రమణ్య స్వామి, జీవీఎల్ నరసింహారావు, రాఘవ్ చద్దా, డి.రాజా, ప్రియాంకా చతుర్వేది తదితరులు పాల్గొన్నారు.
టాక్ జర్నలిజం ఈవెంట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం



