ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం

 ఏఐసిసి సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 26: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు సొంత ప్రెస్‌క్లబ్ భవనం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారంగా పక్కా ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి తమవంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత మున్సిపాలిటీ భవనంలో ఏర్పాటు చేసిన సూర్యాపేట ప్రెస్‌క్లబ్ కార్యాలయాన్ని ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్‌రావు అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా జర్నలిస్టులు పనిచేస్తారని అన్నారు.
నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో మీడియా పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. గతంలో రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి జర్నలిస్టుల సమస్యలను గుర్తించి గృహనిర్మాణం కోసం ఇంటి స్థలాలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో నేడు ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి కూడా అందరి సహకారంతో ముందడుగు వేస్తామని తెలిపారు.

జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగితే ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణం మరింత వేగంగా సాధ్యమవుతుందని అన్నారు. వార్తల రచనలో మంచి విషయాలను మంచిగా, చెడును చెడుగా చూపించడం తప్పుకాదని, అయితే సమాజాన్ని నిర్మించే సానుకూల అంశాలను కూడా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.

ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పదేళ్ల క్రితమే స్థలం కేటాయించినట్టు తెలిపారు. అవసరమైన స్థలం, అనుమతులు, వనరుల సమీకరణలో తమవంతు సహకారం నిరంతరం ఉంటుందని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల ముందు పాత్రికేయులతో మేధోమథనం నిర్వహించి, మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, చకిలం రాజేశ్వరరావు, అంజద్ అలీ, కెక్కిరేని శ్రీనివాస్, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు సుంకరబోయిన వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కందుకూరి యాదగిరి, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *