– మెదక్ కాంగ్రెస్‌కు బిగ్ షాక్
– మెదక్‌లో ఎగిరేది గులాబీ జెండానే
– హరీష్‌రావు ధీమా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సి.సుప్రభాత్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి శుక్రవారం బీఆర్ఎస్ లో చేరారు. ఆయన పాతికేళ్లుగా కాంగ్రెస్ లో ఎన్ఎస్ యూఐ నుంచి పీసీసీ సెక్రటరీ వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నివాసంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ సీనియర్ నాయకుడు కంఠంరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. వారికి హరీష్ రావు గారు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు.. ఆ పార్టీ నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని, హామీలు నెరవేర్చలేక చేతులెత్తేశారని విమర్శించారు. అందుకే అభివృద్ధిని కాంక్షించే కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సుప్రభాత్ రావు లాంటి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. రామాయంపేటలో సుప్రభాత్ రావు చేరికతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని, మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి సముచిత స్థానం, గౌరవం ఉంటాయని హామీ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతితో పట్టణాలు, మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. పచ్చదనం, పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాలతో కళకళలాడిన పట్టణాలు నేడు కాంగ్రెస్ పాలనలో నిధులు లేక, నిర్వహణ లేక పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయబోయేది, విజయ ఢంకా మోగించేది బీఆర్ఎస్ పార్టీనే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సుప్రభాత్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు లేదని, కేవలం గ్రూపు రాజకీయాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమని, కేసీఆర్ ,హరీష్ రావుల నాయకత్వంపై నమ్మకంతోనే తాను బీఆర్ఎస్ లో చేరానని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేటలో గులాబీ జెండా ఎగురవేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





