– బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పోలీసు బాస్
– అంకితభావంతో పనిచేసే పోలీసును కోల్పోయాం
– రియాజ్ ఎన్‌కౌంటర్‌పై విచారణ
– హాస్పిటల్‌లో గాయపడ్డ ఆసిఫ్‌కు పరామర్శ
– డీజీపీ శివధర్ రెడ్డి
నిజామాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్21: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లోని కానిస్టేబుల్ ఇంటికి వచ్చిన డీజీపీ, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పలువురు ఉన్నతాధికారులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే ఒక మంచి కానిస్టేబుల్‌ను కోల్పోయామన్నారు. ఇది పోలీస్ శాఖను తీవ్రకలవరానికి గురి చేసిందన్నారు. రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనపై విచారణ జరుగుతోంది. విచారణ జరుగుతున్నప్పుడు కేసు గురించి మాట్లాడితే దర్యాప్తు అధికారిని ప్రభావితం చేసినట్లు అవుతుంది. ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం, సెప్టెంబరు నెల వేతనం ఎంత తీసుకున్నారో ఆ మొత్తాన్ని పదవీ విరమణ తేదీ వరకు ప్రతినెలా ఆయన కుటుంబానికి అందించాలని, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పోలీసు భద్రత, వెల్ఫేర్ బోర్డుల నుంచి రూ.24 లక్షల పరిహారం, పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. నిజామాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, అతన్ని పట్టుకునే క్రమంలో మరొక యువకుడు ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, ఆయన సాహసాన్ని ప్రశంసిస్తూ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం నాంపల్లిలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు. హాస్పిటల్‌లో ఆసిఫ్‌ను కలసిన డీజీపీ శివధర్‌రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి ఆరా తీశారు. డాక్టర్లు వివరించిన ప్రకారం ఆసిఫ్‌పై సర్జరీ పూర్తయిందని, ప్రస్తుతం ఆయన చేతి నరాలను సవ్యంగా కలిపి సాధారణ స్థితికి తీసుకురావడానికి చికిత్స కొనసాగుతున్నదని తెలిపారు. ఆసిఫ్ పరిస్థితి స్థిరంగా ఉందని డీజీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్‌రెడ్డి, ఆసిఫ్ చాలా ధైర్యంగా, నిజమైన పోలీసు స్ఫూర్తితో వ్యవహరించాడు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఆయన చూపిన సాహసం ప్రశంసనీయం. ఆయన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు, ఆసిఫ్ ధైర్యాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గ్యాలంట్రీ మెడల్ కోసం సిఫార్సు చేస్తామని తెలిపారు. నిందితుడు రియాజ్ చేసిన దాడిలో ఆసిఫ్ రెండు చేతులకు లోతైన కత్తిగాట్లు అయ్యాయి. చేతి నరాలు కోసుకు పోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. మొదట స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం మల్లారెడ్డి హాస్పిటల్‌లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. డాక్టర్లు ఆసిఫ్‌పై సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, కొద్ది వారాల్లో ఆయన కోలుకుంటారని తెలిపారు. గత వారం జరిగిన ఈ ఘటనలో రౌడీషీటర్ రియాజ్‌ను నిజామాబాద్ పోలీసులు అక్టోబర్ 17న అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో అతను సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాల కారణంగా కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర పోలీస్ శాఖ, నిందితుడిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టింది. చివరికి రియాజ్‌ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ ధైర్యంగా ఎదుర్కొని తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం రియాజ్‌ను పట్టుకొని హాస్పిటల్‌కి తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ మరోసారి పోలీసులు పై దాడికి పాల్పడి ఆయుధాలు లాక్కునేందుకు యత్నించాడు. ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత పోలీస్ శాఖలో ఆసిఫ్ సాహసానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సాధారణ వ్యక్తి అయినా పోలీసుల మాదిరిగా ప్రమాదంలో పాల్గొని నిందితుడిని పట్టుకునేందుకు సాహసం చేసినందుకు ఆయనను రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నట్లుగా, ఆసిఫ్ సాహసాన్ని గుర్తించి గ్యాలంట్రీ అవార్డుకు సిఫార్సు చేయడం ద్వారా ఆయనకు తగిన గౌరవం అందించనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు లొంగిపోవాలని ఇప్పటికే సీఎం సూచించారు. తెలంగాణ నుంచి ఇంకా దాదాపు 65 మంది మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్నారు. వారిపై ఉన్న కేసుల విషయంలో సానుభూతితోనే వ్యవహరిస్తాం, ఎలాంటి వేధింపులు ఉండవని డీజీపీ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





